ఉన్నతాధికారి కుమారుడికి కరోనా... అప్రమత్తమైన యంత్రాంగం - కరోనా వార్తలు
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి... పశ్చిమగోదావపరి జిల్లాలో ఓ వేడుకలో పాల్గొన్నట్లు తెలియడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అతడిని కలిసిన బంధువులందరికి వైద్యులు వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని రాఘవాపురం గ్రామంలో ఈనెల 18న జరిగిన ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఓ ఉన్నతాధికారి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆ అధికారి కుమారుడు లండన్ నుంచి రావడంతో అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అతను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లాడని ఆరా తీశారు. పశ్చిమగోదావరి జిల్లా రాఘవాపురం గ్రామానికి వచ్చినట్లు తెలియడంతో జిల్లా అధికారులు అతడిని కలిసిన బంధువులందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు బయటకు రావద్దని వారిని సూచించారు. రాఘపురం గ్రామానికి ఎవ్వరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ముత్యాల రాజు ఆదేశాలు జారీ చేశారు.