పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన పాజిటివ్ కేసులు.. గ్రామీణ ప్రాంతాలకు వేగంగా విస్తరించాయి. గతంలో జిల్లాలో నమోదయ్యే కేసుల్లో 80 శాతం ఏలూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ప్రాంతాల్లో నమోదయ్యేవి. ప్రస్తుతం ఏలూరు గ్రామీణ మండలం, భీమవరం గ్రామీణం, తాడేపల్లిగూడెం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక కేసులు వస్తున్నాయి. చాగల్లు, పెనుగొండ, దేవరాపల్లి, అత్తిలి, పాలకోడేరు నల్లజర్ల, చింతలపూడి లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతున్నాయి.
ఆగస్టు మొదటి వారం వరకు పట్ణణ ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యేవి. ఆగస్టు రెండో వారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో కరోనా విజృంభిస్తోంది. నిన్న జిల్లాలో 1452కేసులు నమోదయితే.. అందులో 9వందలకు పైగా కేసులు పల్లె ప్రాంతాల్లో నమోదైనవే. జిల్లాలో ఇప్పటి వరకు 36,867 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంతాల్లో అధికంగా కరోనా సోకింది. ఆగస్టు రెండు వారం నుంచి ఏలూరులో కేసుల నమోదు.. 70శాతానికి పడిపోయింది. గతంలో ఐదు వందలకు పైగా కేసులు ఏలూరులోనే నమోదయ్యేవి. ప్రస్తుతం 80 కేసులు నమోదవుతున్నాయి.