పోలవరంలో పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్సులు పోలవరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తహశీల్దార్ నరసింహమూర్తి, ఎంపీడీవో మన్మథరావు, సీఐ నవీన్‌నరసింహమూర్తి, ఎస్సై శ్రీను, వింజరం, కేఆర్‌పురం వైద్యులు ఎస్కే ఆయేషా, అభిషేక్‌లు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాలను మూయించారు. మసీదు సెంటరు నుంచి 150 మీటర్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు గ్రామంలో పర్యటించారు. సీఐ మాట్లాడుతూ రెడ్‌జోన్ పరిధిలో 2,748 కుటుంబాలు ఉన్నాయని, వారంతా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.
ఆచంట, న్యూస్‌టుడే: పెనుగొండ మండలం ములపర్రులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆచంట మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ములపర్రుకు రాకపోకలు సాగించే ఆచంట-సిద్ధాంతం ఆర్‌అండ్‌బీ రహదారిని మూసివేశారు. ములపర్రు సమీపంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఆచంటలో ప్రధాన వీధులను దిగ్బంధం చేశారు.
పెనుగొండలో..
పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండ మండలంలో మూడు పాజిటివ్ కేసులు నిర్ధరణ కావడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పెనుగొండకే పరిమితమైన కరోనా వ్యాప్తి ఇప్పుడు మండలంలోని ములపర్రుకు పాకింది. ఇక్కడ ఒక పాజిటివ్ కేసు నమోదైంది. పెనుగొండ రెడ్‌జోన్ ప్రాంతంలోని వీధుల్లోకి ప్రజలు రాకుండా సీఐ పి.సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ● కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సూచనలను విధిగా పాటించాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ములపర్రులో పర్యటించారు. ములపర్రులో 12 మంది నమూనాలను భీమవరం, పెనుగొండలో ఏడుగురి నమూనాలను ఏలూరుకు పంపామన్నారు.
ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు తూర్పు వీధిలో రెడ్‌జోన్‌లో ఓ వృద్ధుడు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఈ ప్రాంతాన్ని సూపర్ శానిటేషన్ చేసి.. బ్లీచింగ్ చల్లుతున్నారు. జిల్లాలో ఆదివారం కరోనా బారిన పడిన వారందరినీ ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి, వారి కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
ఇవీ చూడండి..