ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది రోజుల్లో 1500 కేసులు.. నిండుతున్న ఆసుపత్రులు - పశ్చిమ గోదావరి లో కరోనా కేసులు

పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్-19 పంజా విసురుతోంది. తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనాతో కొవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కేవలం పదిరోజుల వ్యవధిలోనే జిల్లాలో 15వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. జులై నెలలోనే పాజిటివ్ కేసుల నమోదు వంద శాతం పెరిగింది. అధికమవుతున్న పాజిటివ్ కేసులకు తోడు.. నమూనా ఫలితాలు ఆలస్యంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

corona cases at west godavari
పశ్చిమ గోదావరి కరోనా కేసులు

By

Published : Jul 15, 2020, 9:06 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో మే నెలలో కరోనా కేసుల సంఖ్య కేవలం 126.. జూన్ నెలలో 850, జులై నెల రెండు వారాలకే 2233 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జులై మొదటి వారం నుంచి కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ప్రధానంగా ఏలూరు, నరసాపురం ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. జిల్లాలో నమోదైన కేసుల్లో 70శాతం ఏలూరులో నమోదవుతున్నాయి. జిల్లాలో 2233 కేసులు నమోదైతే.. ఇందులో 16వందల కేసులు ఏలూరు నగరంలో నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటికే 340 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఏలూరు ఆశ్రం కొవిడ్ ఆస్పత్రితోపాటు.. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో 2233 మందికి పాజిటివ్ నమోదు కాగా... 1058 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 1148 మంది చికిత్స పొందుతున్నారు. 32 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.

ఏలూరు నగరంలో అధికంగా పాజిటివ్ కేసుల నమోదవుతున్నందున లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే నిత్యవసరాలు, కూరగాయల దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. 11 గంటల తర్వాత ప్రజలు రహదారుల్లో తిరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

జిల్లాలో కొవిడ్ నమూనాల ఫలితాలు ఆలస్యంగా వస్తుండటం వల్ల.. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫలితాలు అందడానికి వారం, పదిరోజులు పడుతోంది. పాజిటివ్ ఉన్నవారు.. తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు.. నాలుగు సంచార సంజీవని వాహనాల ద్వారా నమూనాలు సేకరిస్తున్నారు. ఫలితాలు త్వరతగతిన వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: బ్యాంక్​ చోరీ- రూ.10లక్షలు కొట్టేసిన పదేళ్ల బాలుడు

ABOUT THE AUTHOR

...view details