ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భద్రాచలం కరకట్ట ఖరారు..! ఇకనైనా వరద కష్టాలు తీరేనా..!! - Telangana latest news

Gadavari Karakatta: గోదావరి వరద ముంపు నుంచి భద్రాచలం రక్షణకు శ్రీరామ రక్షలా భావిస్తున్న కరకట్టల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భద్రాచలం, బూర్గంపాడు రెండు వైపులా కలిపి 58 లేదా 65 కిలోమీటర్ల పొడవునా 2 రకాలుగా ఈ కరకట్టలు నిర్మించేందుకు నీటి పారుదల శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. తాజాగా కరకట్టలపై సిద్ధమైన లైన్‌ ఎస్టిమేట్ల మేరకు త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసే అవకాశం ఉంది.

Bhadrachalam Karakatta
భద్రాచలం కరకట్ట

By

Published : Dec 25, 2022, 9:42 AM IST

Gadavari Karakatta: గోదావరి వరద ముంపు నుంచి శాశ్వత రక్షణ కల్పించేందుకు భద్రాచలంలో నిర్మించనున్న కరకట్టలకు ప్రాథమిక అంచనాలు సిద్ధమయ్యాయి. భద్రాచలం, బూర్గంపాడు రెండు వైపులా కలిపి 58 కిలోమీటర్లు లేదా 65 కిలోమీటర్ల పొడవున ఈ కట్టలను నిర్మించేందుకు ఇంజినీర్లు లైన్‌ ఎస్టిమేట్లు రూపొందించారు. ఈ ఏడాది జులైలో వచ్చిన భారీ వరదను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక ఖరారు చేశారు. నదికి వరద వచ్చినప్పుడు వాగుల ప్రవాహం స్తంభించి స్థానికంగా ముంపు పెరుగుతుండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 58 కిలోమీటర్ల పొడవుతో అయితే రూ.1,585 కోట్లు, అదే 65 కిలోమీటర్లయితే రూ.1,625 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం నదికి కుడివైపు బూర్గంపాడు మండలం సంజీవ్‌రెడ్డి పాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వరకు ఒకవైపు కట్ట నిర్మిస్తారు. నదికి ఎడమవైపు భద్రాచలం మండలం సుభాష్‌నగర్‌ కాలనీ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టీ గ్రామం వరకు ఒక కట్ట నిర్మాణం ఉంటుంది. ఒక్కోవైపు 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల పొడవుతో కట్ట నిర్మాణం ఉంటుంది.

భద్రాచలం కరకట్ట ఖరారు..! ఇకనైనా వరద కష్టాలు తీరేనా..!!

కట్ట నిర్మాణం బారుగా కాకుండా గ్రామాలు వచ్చిన చోట కొంత గ్యాప్‌ వదలాలని, నదీ తీరం వెంబడి గ్రామాలకు సమీపంలో ‘యు’ అక్షరం ఆకారంలో కట్టలను నిర్మించాలన్నది ప్రాథమిక అంచనాల్లో ఉన్న కీలక అంశాలు. వాగుల్లోని నీరు నదిలోకి వెళ్లేందుకు వీలుగా కట్టకు, వాగుకు మధ్య నిర్మాణం చేపడతారు.
స్వతంత్ర సంస్థకు అధ్యయన బాధ్యత:ఈ ఏడాది జులైలో గోదావరికి వచ్చిన వరద నది చరిత్రలోనే రెండో భారీ వరదగా నమోదయింది. 1986లో భద్రాచలం వద్ద 75.6 అడుగులు నమోదుకాగా ఈ ఏడాది 71.5 అడుగులు వచ్చింది. తాజా ప్రవాహం ఐదు రోజులపాటు స్థానిక ప్రాంతాలను ముంచెత్తింది. భద్రాచలం పట్టణంలో గతంలో లేని విధంగా కొత్త ప్రాంతాల్లోకి నీరు వచ్చింది. పరిసర ప్రాంతాల్లో 100 గ్రామాల వరకు ముంపు ప్రభావం కనిపించింది.

ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే రక్షణ చర్యలు చేపట్టనున్నారు. తాజాగా కరకట్టలపై సిద్ధమైన లైన్‌ ఎస్టిమేట్ల మేరకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిసింది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకు స్వంతంత్ర సంస్థతో అధ్యయనం చేయించనున్నట్లు సమాచారం.

గోదావరి ప్రవాహంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ముంపు ఏర్పడుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి గోదావరికి విడుదలయ్యే నీటి పరిమాణం నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరకు నమోదయితే నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోని పరీవాహకంలో ముంపు ఉంటున్నట్లు గుర్తించారు. నదికి ఒకవైపు సుమారు 35 కిలోమీటర్లు, మరోవైపు 26 కిలోమీటర్ల వరకు కట్టల నిర్మాణం చేపట్టాలన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. త్వరలో ఆ సర్కిల్‌ ఇంజినీర్లు నీటిపారుదల శాఖకు సమర్పించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details