ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీలో అసమ్మతి మంటలు.. సీటు కోసం నువ్వా-నేనా - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

YCP MLAs Discord flares: నడిరోడ్డుపై ఎమ్మెల్యేల పరస్పర దూషణలు.. అసెంబ్లీ టికెట్ల కోసం వర్గ పోరాటాలు.. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చిన చోట సహాయ నిరాకరణలు.. ఇదీ కోస్తా జిల్లాల్లోని అత్యధిక నియోజకవర్గాల్లో అధికార వైసీపీ పరిస్థితి. కొన్నిచోట్ల మంత్రులకు కూడా అసమ్మతి సెగ తప్పడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు టిక్కెట్‌ ఆశిస్తున్న వారు.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగి నచ్చజెప్పినా సరే.. ఎవరూ తగ్గేదే లే అంటున్నారు.

YCP MLAs Discord flares
YCP MLAs Discord flares

By

Published : Apr 12, 2023, 7:07 AM IST

YCP MLAs Discord flares: వైసీపీకి కంచుకోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. 2019ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడా జిల్లా నుంచే పార్టీ పతనం ప్రారంభమైందా అన్నట్లుగా వాతావరణం మారుతోంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం వేసిన సస్పెన్షన్‌ వేటు.. జిల్లాలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా రాజకీయాలను శాసించగలరనే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. మరో ప్రధాన కుటుంబం మేకపాటి వారిది. ఆ కుటుంబంలో ఇన్నాళ్లూ కీలకంగా వ్యవహరించిన చంద్రశేఖరరెడ్డి.. వైసీపీపై యుద్ధం ప్రకటించారు.

అప్పుడు మద్దతు.. ఇప్పుడు వ్యతిరేకం: నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను ఆయన బాబాయ్, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్​తో పాటు నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకా నాథ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేటర్లు కూడా అనిల్ వర్గం, రూప్‌కుమార్‌ వర్గంగా విడిపోయారు. 2019 ఎన్నికల్లో అనిల్‌ విజయానికి పూర్తి మద్దతుగా నిలిచిన ప్రధాన సామాజికవర్గ పెద్దలంతా.. ఇప్పుడు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు కొనసాగుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి: ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలోనూ అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అద్దంకిలో బాచిన కృష్ణచైతన్య, కొండపిలో వరికూటి అశోక్‌బాబు పార్టీ ఇన్‌ఛార్జులుగా వద్దంటూ... ఆ నియోజకవర్గాల వైసీపీ నాయకులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనూ, పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. వీళ్లిద్దరికీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండ ఉంది. అద్దంకిలో Y.V.సుబ్బారెడ్డి వర్గానికి చెందిన నేతలు.. వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో చైతన్యకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

ఎమ్మెల్యేకు నిరసనగా ఆత్మగౌరవ సమావేశాలు: సంతనూతలపాడులో MLA సుధాకర్‌బాబు తమను అవమానిస్తున్నారంటూ ప్రధాన కులాలవారు ‘ఆత్మగౌరవ’ సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో సుమారు 60 వేలకు పైగా ఓట్లున్న ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన దాదాపు 100 మంది ద్వితీయ శ్రేణి, క్షేత్రస్థాయి నాయకులు... నాగులుప్పలపాడులో ఫిబ్రవరి 28న సమావేశమయ్యారు. 4 మండలాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున షాడో ఎమ్మెల్యేలు తమను వేధిస్తున్నారని ఆరోపించారు. తమ కులానికి గుర్తింపు ఇవ్వకపోవడంతోనే మండలానికి ముగ్గురు చొప్పున 12 మందితో సమన్వయ కమిటీని నియమించుకున్నట్లు చెప్పారు. మార్పు రాకపోతే ఇతర కులాల వారితో సమావేశమై తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

టికెట్​ కోసం నేతలు కుస్తీలు: 2024లో దర్శి నుంచి పోటీకి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం... ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దూరం జరుగుతోంది. తెలుగుదేశం నుంచి వచ్చిన శిద్దా రాఘవరావు సైతం టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. పర్చూరులో వైసీపీ నాయకులు.. బాలినేని, Y.V.సుబ్బారెడ్డి వర్గాలుగా విడిపోయారు. బాలినేని వ్యతిరేక వర్గంగా ముద్ర ఉన్న రావి రామనాథంబాబును నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి తప్పించిన జగన్‌... ఆ స్థానంలో ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు పోటీగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి పోటీగా స్థానిక నేతలు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అంబటికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం: ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు.. రెడ్డి సామాజికవర్గం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. డాక్టర్‌ గజ్జల నాగభూషణరెడ్డి, మర్రి వెంకటరామిరెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి... అంబటి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. అంబటి వ్యతిరేకులందరినీ కూడగట్టుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు వరప్రసాద్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి విడదల రజనిపై మర్రి వర్గం అసంతృప్తి: చిలకలూరిపేటలో విడదల రజిని కోసం సీటు త్యాగం చేసినందుకు మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికలముందు జగన్‌ ప్రకటించారు. ఐతే ఇప్పుడా మంత్రి పదవి కూడా రజినికే దక్కింది. అటు ఎమ్మెల్యే సీటు, ఇటు మంత్రి పదవి రెండూ ఆమెకే దక్కడంతో... మర్రి రాజశేఖర్ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చి పార్టీ నాయకత్వం చేతులు దులిపేసుకుంది. మంత్రిలో పొసగక నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు... రాజశేఖర్‌తో కలిసి పనిచేస్తున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి... స్థానిక నేతలతో విభేదాలు కొనసాగుతున్నాయి. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే అదనపు సమన్వయకర్తగా మొదట డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను, ఆ తర్వాత కత్తెర సురేష్‌ను నియమించారు. దీనివల్ల మూడు వర్గాలు వీధికెక్కాయి. ఇప్పుడు ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. టిక్కెట్‌ ఎవరికిస్తారో తెలియక గందరగోళం నెలకొంది.

సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నా ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ వర్గాల మధ్య తగాదాలకు తెర పడలేదు. మంత్రి తీరుపై ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, జగన్‌తో భేటీ తర్వాత కూడా జోగి వర్గీయులు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని వసంత ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో కల్పించుకుంటున్నారని.... ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గడప గడపకు కార్యక్రమంలో తిరగలేనని వసంత చెప్పేశారు.

బహిరంగంగా దూషించుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. పోర్టుకు శంకుస్థాపన తేదీపై ఎంపీ, ఎమ్మెల్యే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. కుమారుడు కృష్ణమూర్తిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని పేర్ని నాని భావిస్తుంటే.... పెడనలో పోటీకి బాలశౌరి యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ తూర్పులో ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్‌ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇటీవల బొప్పన భవకుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను... బహిరంగంగా దూషించుకోవడం కలకలం రేపింది.

పశ్చిమకు చెందిన కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ను సీఎం వద్దకు తీసుకువెళ్లిన ఉదయభానుపై వెలంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గడప గడపకు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఒంటరిగా చేస్తున్నారే తప్ప.. గౌతమ్‌రెడ్డి, రుహుల్లా ఆయనతో కలిసి వెళ్లడం లేదు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరి స్థానంలో మరొకరు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత వెంట ఉన్న నాయకుల్లో చాలా మంది ఆమెకు ఇప్పుడు వ్యతిరేకమయ్యారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా ఓ గ్రూపుగా ఏర్పడి... కొవ్వూరు సీటు ఆశిస్తున్న మండలి ఛైర్మన్‌ మోషేను రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులో అధికార వైసీపీ లో 5 గ్రూపులు కొనసాగుతున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. పార్టీ బాధ్యుడిగా పనిచేసిన గుణ్ణం నాగబాబుకూ మొండిచేయి చూపారు. అప్పట్లో జనసేనలోకి వెళ్లినన గుణ్ణం.. ఎన్నికల తర్వాత మళ్లీ వైసీపీ గూటికే చేరారు. 2019 ఎన్నికలకు కొన్నిరోజుల ముందు వైసీపీ లోకి వచ్చిన డాక్టర్‌ బాబ్జీకి టికెట్‌ ఇవ్వగా.. ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆచంట సీటు సర్దుబాటు కోసం కవురు శ్రీనివాస్‌ను పక్కనబెట్టారు. తర్వాత ఆయన్ను జెడ్పీ ఛైర్మన్‌ను చేసి, ఆచంట నుంచి తెచ్చి పాలకొల్లు వైసీపీ బాధ్యుడిగా నియమించారు. ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు.

DCMS మాజీ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ... ఎప్పటి నుంచో టికెట్‌ ఆశిస్తున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చుట్టూ... అక్రమ మట్టి తవ్వకాలు, భూవివాదాలు ముసురుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గం గోపాలపురంలోనే పోటీ చేయాలని హోంమంత్రి తానేటి వనిత పావులు కదుపుతున్నారు. నాలుగు మండలాల్లో కొందరిని ఎంపిక చేసుకుని ప్రచారం చేయించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య విభేదాలకు తెర పడలేదు.

తూర్పుగోదావరిలో త్రిముఖ పోటీ:ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వైసీపీ నేతల మధ్య విభేదాలు తగ్గడం లేదు. రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన, ఎంపీ బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గాల మధ్య త్రిముఖ పోటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో బోస్‌ కుమారుడికే టికెట్‌ వస్తుందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటుంటే.. వచ్చే ఎన్నికలే కాదు, మున్ముందు కూడా టికెట్‌ తనదేనని మంత్రి ఘంటాపథంగా చెబుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట ఇన్‌ఛార్జిగా నియమితులైనా, రామచంద్రాపురాన్ని విడిచిపెట్టడం లేదు. పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబుకు పోటీగా టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసరావుకు.. మంత్రి విశ్వరూప్‌ మద్దతుంది.

రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఎంపీ మార్గాని భరత్‌ సిద్ధమవుతుంటే.. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఇన్‌ఛార్జి శివరామసుబ్రహ్మణ్యం కూడా పోటీ పడుతున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా వర్గంతో శివరామసుబ్రహ్మణ్యం ఉన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో ఎంపీ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజు వర్గాలు ఉన్నాయి. వీర్రాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా నియమితులైన చందన నాగేశ్వర్‌... గడప గడపకూ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌కు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలకు సఖ్యత లేదు. పెద్దాపురం వైసీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో దొరబాబును కాదని అప్పుడే వైసీపీలోకి వచ్చిన తోట నరసింహం భార్య వాణికి టికెట్‌ ఇవ్వగా.. ఆమె ఓడిపోయారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థికి అనుకూలంగా దొరబాబు పనిచేశారని వాణి అంటుండగా.. తమవారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని దొరబాబు విమర్శలు చేస్తున్నారు.

టీడీపీ నుంచి వలస వచ్చినవాళ్లతో వైసీపీకి తప్పని తిప్పలు: సొంత నేతలతోనే కాదు తెలుగుదేశం నుంచి వలసొచ్చిన ఎమ్మెల్యేలతోనూ వైసీపీ కు తిప్పలు తప్పడం లేదు. గన్నవరంలో వల్లభనేని వంశీకి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా... 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు, మరో నేత దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వ ప్రతినిధులతోపాటు స్వయంగా జగన్ ప్రయత్నించినా ఈ పంచాయితీ తెగలేదు. చీరాలలో ఎమ్మెల్యే కరణం, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ గ్రూపులు ఉన్నాయి.

బలరామ్ కుమారుడు వెంకటేష్‌కు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించి... ఆమంచిని పర్చూరుకు పంపారు. సునీతను మరోసారి ఎమ్మెల్సీ చేశారు. ఇక సమస్య ఉండదని వైసీపీ లెక్కలు వేస్తుండగా... ఎవరి వర్గాలను వారు కొనసాగిస్తూనే ఉన్నారు. గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తిగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details