ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల చదును పనులపై ఫిర్యాదులు నిజమే

ఇళ్ల స్థలాల చదును పనుల్లో కొన్ని చోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వీటిపై పరిశీలన చేశాకే బిల్లులు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇళ్లపట్టాల పంపిణీ, ఇసుక సమస్య, కరోనా నియంత్రణ తదితర అంశాలపై ఆయన ఈనాడు- ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

west godavari district collector
west godavari district collector

By

Published : Jul 5, 2020, 4:47 PM IST

'ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన స్థలాల చదును పనుల్లో కొన్నిచోట్ల అవినీతి జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై విచారణ చేయించాను. ద్వారకాతిరుమల, నిడదవోలు, కొవ్వూరు, నిడమర్రు తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను స్వయంగా సందర్శించాను. సక్రమంగా లేని ప్రతిపాదనలను మళ్లీ తయారు చేయాలని ఆదేశించాను. ఆరోపణలు వచ్చిన ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాతే బిల్లులు జమ చేస్తా'మని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు. ఇళ్లపట్టాల పంపిణీ, ఇసుక సమస్య, కరోనా నియంత్రణ తదితర అంశాలపై ఆయన శనివారం ఈనాడు- ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ

జిల్లాలో అర్హులందరికీ పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో చదును పనులకు ప్రభుత్వ భూముల్లో మట్టి వినియోగించి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూముల్లో నుంచి తీసుకొచ్చినట్లుగా తప్పుడు బిల్లులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. కొందరు తప్పుడు ప్రతిపాదనలు పెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రతిపాదనలకు సంబంధించి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ప్రతిపాదనలు పరిశీలించిన తరువాతే నగదు జమ చేస్తాం. తప్పుడు ప్రతిపాదనలు పెట్టినట్లు నిరూపణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో సుమారు 2500 చదును పనుల ప్రతిపాదనలను పరిశీలించాం.

కొవిడ్‌ సెంటర్లలో సదుపాయాల కల్పన

జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఏలూరులో మరీ ఎక్కువగా ఉంది. దీని నియంత్రణకు లాక్‌డౌన్‌ పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్ల్లాలో పరిస్థితులను పరిశీలించి జులై రెండోవారంలో నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో సోషల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులను కూడా భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తున్నాం. వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం. కొవిడ్‌ సెంటర్లలో సదుపాయాల గురించి సమీక్షించాం. భోజనం, తాగునీరు, సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చి లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తాం. మిగిలినవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచుతాం. అక్కడ కూడా వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఇసుక సరఫరాలో చిరునామా సమస్య

ఇసుక సరఫరాలో అంతరాయం ఎక్కువగా అడ్రస్‌ సమస్యల వల్లే వస్తోంది. చాలా మంది అవగాహన లోపం వల్ల ఇసుక బుక్‌ చేసి చిరునామా నమోదు చేయకుండా వదిలేస్తున్నారు. ఆన్‌లైన్‌లో తక్కువ సమయం మాత్రమే ఇసుక బుకింగ్‌కు అవకాశం ఉందని తర్వాత నోస్టాక్‌ అని చూపిస్తోందని చాలామంది ఫిర్యాదులు చేశారు. దీని కోసం ఒక వారం రోజుల పాటు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక బుకింగ్‌ అవకాశం ఇచ్చాం. ఈ వారం రోజుల్లో దాదాపు 3లక్షల వరకు ఆర్డర్లు వచ్చాయి. జిల్లాలో ఒక్క రోజులో 26 నుంచి 29 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుంది. ఇందులో సరఫరా చేసేది 12వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని గతంలో బుక్‌ చేసి సరఫరా కానివారికి పంపిస్తున్నాం. కొన్ని చోట్ల లారీడ్రైవర్లు నగదు అడుగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి వారిపై చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు నవంబరు నెలలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ముందస్తుగా తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం తదితర ప్రాంతాల్లో నిల్వ కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం-ముత్యాల రాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్.

ఇదీ చదవండి

ఎన్నో ఆసుపత్రులు తిరిగిన అందని వైద్యం... చివరికి యువకుడు మరణం

ABOUT THE AUTHOR

...view details