సామాజిక ఐక్యత ఆవశ్యకతను, గొప్పతనాన్ని చాటిచెప్పిన గొప్ప సంస్కర్త అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. భావాలపరంగా ఎన్నటికీ మరణం లేని విప్లవవీరుడాయన అని కొనియాడారు. స్వతంత్రం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎంతో మంది త్యాగధనులు, పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్నికణమన్నారు. భీమవరం సభలో సోమవారం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలుగుజాతికి, భారత దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం. ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి, త్యాగానికి నివాళులర్పిస్తున్నాం. ఆ మహనీయుడి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే.. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం. అక్కడా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. అడవిలోనూ అగ్గి పుట్టించిన ఆ యోధుడు తరతరాలకు సందేశమిచ్చేలా బతికారు. చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదు. దేశం, అడవి బిడ్డల కోసం తనను తాను అర్పించుకున్న ఆ మహావీరుడికి వందనం. సీతారామరాజు ఎప్పటికీ చరితార్ధుడే. ఆయన త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది’ అని జగన్ కొనియాడారు.
దోపిడీకి వీల్లేని సమాజం కోసం కలలుగన్నారు..