పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో.. అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ ఇంటి స్థలం విషయంలో.. ఇరు వర్గాలు పొట్లాటకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏం జరిగిందంటే...?
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద.. డ్వాక్రా మహిళలకు లబ్ధి అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్లిపోతున్న సమయంలో.. గ్రామ సర్పంచ్ సరెళ్ల కాంతిప్రియ వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు.. తనకు అర్హత ఉన్నప్పటికీ ఇంటిస్థలం రాలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. అర్హులందరికీ ఇంటి స్థలం వస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చి వెళ్లిపోయారు. ఇంటి స్థలం అడిగిన వ్యక్తిని నియోజకవర్గ యువజన నాయకుడు మట్టా వెంకట్ వర్గం వారు.. కొట్టడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు.