ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న వరి చేలు, కూరగాయలు, అరటి తోటలను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామానికి చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి స్వాగతం పలికారు.
నందమూరులో ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. పంట నష్టం వివరాలను జిల్లా జాయింట్ కలెక్టర్..కేంద్ర బృందానికి వివరించారు. వరద నీరు పంట పొలాల్లో దాదాపు వారం రోజులపాటు నిలిచిపోవడంతో వరి కంకులు రాలేదని, పొట్టపోసుకునే దశలో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయని తెలిపారు.
కేంద్ర బృందం రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట చేతికి వచ్చే సమయానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని కేంద్ర బృందం ముందు వాపోయారు. అనంతరం నందమూరు ఆక్విడెక్ట్ ప్రాంతానికి చేరుకున్న బృందానికి నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు స్వాగతం పలికి ఎర్ర కాలువ కింద సాగు వివరాలను తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులను... అధిక వర్షాలు, వరదలు కోలుకోలేని దెబ్బతీశాయన్నారు.
అనంతరం నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో దెబ్బతిన్న అరటి, దొండ పంటలను కేంద్ర బృందం పరిశీలించారు. ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరక్టర్ సుబ్బారావు కేంద్ర బృందానికి పంట నష్టం వివరాలు తెలిపారు. జిల్లాలో 32 మండలాల్లో 2,035 హెక్టార్లలో అరటి, కూరగాయల తోటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు మాట్లాడుతూ ఎకరాకు 1200 అరటి మొక్కలు నాటామని ఇప్పటికీ 80 వేల రూపాయిలు ఖర్చు చేశామన్నారు. అరటి గెలలు వచ్చే సమయానికి వరదలు వచ్చి పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. కరోనా సమయంలో దొండకాయలు కిలో ధర రూపాయికి పడిపొయిందని, ఇప్పుడు రేటు పలుకుతున్న సమయంలో అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలు పూర్తిగా తగ్గిపోయాయని రైతులు వాపోయారు.
ఎర్రకాలువ వరద వలన కూలిపోయిన మాధవరం-కంసాలపాలెం బ్రిడ్జిని కేంద్ర బృందం పరిశీలించింది. వరదనీరు నిరంతరాయంగా రోజులు తరబడి ప్రవహించడంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న కట్టలు కోతకు గురై బ్రిడ్జి కూలిపోయిందని ఆర్ అండ్ బి ఎస్.ఈ విజయ నిర్మల బృంద సభ్యులకు తెలిపారు. కేంద్ర బృందం పర్యటనలో కొవ్వూరు ఆర్డీవో లక్ష్మా రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ గౌసియ బేగం, ఇరిగేషన్ ఎస్.ఈ సూర్య ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలోనూ గెలుస్తాం: రమేశ్ నాయుడు