ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 3:42 AM IST

ETV Bharat / state

నేడు ఏలూరుకు కేంద్రం బృందం రాక

ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధి కారణాలను కనక్కోవడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మంగళవారం ఉదయానికి ఏలూరుకు చేరుకుని సాయంత్రానికి నివేదిక సమర్పించనుంది. అస్వస్థతకు దారితీస్తున్న పరిస్థితులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... కేంద్ర మంత్రి హర్షవర్థన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హర్షవర్ధన్‌ ప్రత్యేక బృందాన్ని క్షేత్రస్థాయికి పంపి సమస్యపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆ వెంటనే ఉత్తర్వులు జారీచేశారు.

Central team arrives in Eluru today for invest Disease
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధి ఆనవాళ్లను కనుక్కోవడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యంతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. దిల్లీ ఎయిమ్స్‌ అత్యవసర వైద్యవిభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జంషెడ్‌ నాయర్‌, పుణే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన వైరాలజిస్ట్‌ అవినాష్‌ దశోత్సవర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సంకేత్‌ కులకర్ణిలతో కూడిన ఈ బృందం మంగళవారం ఉదయానికల్లా ఏలూరు చేరుకొని సాయంత్రానికి నివేదిక సమర్పిస్తుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏలూరు పరిస్థితులను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యానికి దారితీస్తున్న పరిస్థితులను తెలుసుకొని తగిన చికిత్స అందించాలని సూచించారు. స్పందించిన హర్షవర్ధన్‌ ప్రత్యేక బృందాన్ని క్షేత్రస్థాయికి పంపి సమస్యపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆ వెంటనే ఉత్తర్వులు జారీచేశారు.

అంతకు ముందు వెంకయ్యనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుతో మాట్లాడారు. చిన్నారులు ఎక్కువ మంది అనారోగ్యం పాలవడానికి కారణాలను ఆరా తీశారు. అస్వస్థతకు కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి బృందాలను రప్పించి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. తర్వాత వెంకయ్యనాయుడు మంగళగిరి, దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్లతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఇదే అంశంపై విలేకర్లతో మాట్లాడుతూ ఏలూరులో నెలకొన్న ఆందోళన పరిస్థితులకు కారణాలు తెలుసుకోవడానికి ఎయిమ్స్‌ అధికారులు కేంద్ర, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు చెప్పారు. సమస్యకు కారణాలను లోతుగా అధ్యయనం చేయడానికి మరిన్ని నమూనాలు పంపాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.


పశ్చిమ గోదావరికి బదులు తూర్పుగోదావరి పేరు


కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పశ్చిమగోదావరికి బదులు తూర్పుగోదావరి పేరును ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి బృందాన్ని పంపుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

ఇదీచదవండి.

అంతుచిక్కని వ్యాధి...అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన

ABOUT THE AUTHOR

...view details