రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం వివరాలను కేంద్ర జలశక్తి శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి పోలవరం 69.54 శాతం పూర్తయినట్లు రాష్ట్రం చెప్పిందని, పోలవరం ప్రాజెక్టు ఖర్చును వందశాతం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. 2014 నుంచి రాష్ట్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయినీ కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు. పోలవరానికి కేంద్రం ఇప్పటివరకు రూ.8614.16 కోట్లు ఏపీకి చెల్లించిందని, ఈ మొత్తంలో గత నెల విడుదల చేసిన రూ.1,850 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.
2014 మార్చి వరకు చేసిన ఆడిట్ నివేదికలు ఇవ్వాలని రాష్ట్రానికి లేఖలు రాశామని, 2013 - 14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 2018 జులై, 2019 మేలో రాసిన లేఖలకు రాష్ట్రం స్పందించలేదన్న మంత్రి.. ఆడిట్ వివరాలన్నీ ఇచ్చేవరకు తదుపరి నిధుల విడుదల కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై గతేడాది నవంబరు 26న రాష్ట్రానికి మరోలేఖ రాసినట్లు షెకావత్ పేర్కొన్నారు. గతేడాది మే 7న రివైజ్డ్ కాస్ట్ కమిటీకి లేఖ రాసినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. రూ.54,446 కోట్ల సవరణ అంచనాలు పంపామని జలసంఘం లేఖలో చెప్పిందని మంత్రి తెలిపారు. రాష్ట్రం అందించిన వివరాల మేరకు రూ.3,777 కోట్లకు ఆడిట్ పూర్తయ్యిందని.. మిగిలిన నిధుల విడుదల రాష్ట్రం ఇచ్చే వివరాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. 2021 డిసెంబరు నాటికి పోలవరం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.