ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No Funds to Polavaram: "పోలవరానికి ఇచ్చేది ఇంతే".. తేల్చిచెప్పిన కేంద్రం.. అయినా నోరు మెదపని సీఎం.! - ఏపీ ముఖ్య వార్తలు

Central Government Note on Polavaram Funds: పోలవరం ప్రాజెక్టుకు ఇక 12 వేల 911.15 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తేల్చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2017లో కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన మొత్తానికి అదనంగా ఇంతే ఇస్తామని ఒక నోట్‌లో స్పష్టం చేసింది. అంటే.. ప్రాజెక్టు అంచనా ప్రకారం అవసరమైన మరో 23 వేల 249.11 కోట్ల సంగతి అటెకెక్కినట్లే. పూర్తి నిధులు ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నా.. సీఎం జగన్ మాత్రం నోరెత్తడం లేదు. వైసీపీను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తెస్తామని ఢంకా బజాయించి చెప్పిన జగన్ మాటలు నమ్మిన ప్రజలు.. 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా కేంద్రం మెడలు వంచడం సంగతి అటుంచి.. దిల్లీ పెద్దల ముందు ఈయనే మెడలు వంచుకుని బాబ్బాబు అంటూ బతిమాలుకుంటున్నారు.

polavaram
polavaram

By

Published : Jul 10, 2023, 6:46 AM IST

"పోలవరానికి ఇచ్చేది ఇంతే".. తేల్చిచెప్పిన కేంద్రం.. అయినా నోరు మెదపని సీఎం.!

Central Government Note on Polavaram Funds: నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీకి వెళుతూనే ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి మోదీని జగన్‌ కలిసొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి విడుదల చేసే పత్రికా ప్రకటనలోనూ.. పోలవరం ప్రాజెక్టుకు 55వేల 548.87 కోట్ల రూపాయలప ఇవ్వాలని అడిగినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఏం అడిగారో ప్రధానమంత్రి కార్యాలయం ఏనాడూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసి వివరాలు వెల్లడించలేదు.

ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం గతంలో మంజూరు చేసిన 20వేల 398.61 కోట్లు మినహాయిస్తే.. మిగిలిన 35వేల 150.26 కోట్లకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపాలి. అయితే కేంద్రం మాత్రం ఇక 12వేల 911 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. తాజాగా విడుదల చేసిన నోట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. అయినా సీఎం జగన్‌ కేంద్రాన్ని ఎందుకు గట్టిగా డిమాండ్‌ చేయడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తెస్తామన్న జగన్‌.. ఇప్పుడు ఎందుకు బేలగా మారిపోయారని అంటున్నారు.

ప్రతిపక్షంలో ఉండగా కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. అధికారంలోకి వచ్చాక బతిమాలుకునే స్థాయికి దిగొచ్చారు. గతేడాది జులై 27న చింతూరు, వేలేరుపాడుల్లో పర్యటించిన ఆయన.. కేంద్రం కనికరిస్తే తప్ప చేసేదేమీ లేదని సెలవిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు రెండు దశలు, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కలిపి.. 55వేల 548.87 కోట్లకు కేంద్రం డీపీఆర్‌ ఆమోదించాలి. ఇప్పటివరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన 20వేల 398.61 కోట్లు మినహాయిస్తే.. మిగిలిన 35వేల 150.26 కోట్లకు ఆమోదం తెలపాలి. అయితే జూన్‌ 5న ఆర్థికశాఖ ఆదేశాల మేరకు పోలవరానికి ఇక ఇచ్చేది 12వేల 911.15 కోట్లేనని తేల్చి చెప్పేసింది.

ఈ మొత్తానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీనికి కేంద్రమంత్రి మండలి ఆమోదించాలని తెలిపింది. అయినా మిగిలిన నిధుల కోసం వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడటం లేదు. పైగా రెండోదశ పునరావాసానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులిచ్చే పరిస్థితుల్లో లేదన్నారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేది 12వేల 911 కోట్లే అని తేలినందున.. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు ఎప్పటికి నిలబెడతారు..? పోలవరం భవితవ్యం అగమ్యగోచరమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తేవాలన్నా రెండు చట్టసభల ఆమోదం తప్పనిసరి. లోక్‌సభలో బీజేపీకు కావాల్సినంత బలం ఉన్నా, రాజ్యసభలో మెజారిటీ లేదు. అనేక సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుల బలం కేంద్రానికి అవసరమైంది. అలాంటి కీలక పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రజల ప్రశ్నలకు.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details