పశ్చిమ గోదావరి జిల్లాలోని 3,270 పాఠశాలల్లో 2.67 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకంలో నమోదయ్యారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తున్నాయి. 9, 10 తరగతులకు నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018-19 నుంచి 2019-20 వరకు ఏటా ధరలు పెంచుతున్నాయి. 2019-20 జనవరిలో ‘గోరుముద్ద’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మెనూ పెంచడంతో పాటు స్వల్ప మార్పులు చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జనవరిలో ధరలను పెంచింది.
ఇంటికే సరకులు
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 97 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 77, ఉన్నత పాఠశాలల్లో 77, ప్రత్యేక పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు బడి భోజనం చేస్తున్నారు. మార్చి 19 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అప్పటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు మధ్యాహ్న భోజన సరకులను విద్యార్థుల ఇంటికే అందించారు.