కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ఇకపై నిఘా నీడలో నడవనున్నాయి. కొవిడ్ ప్రైవేటు హాస్పిటల్స్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వాటిని జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతిలోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. కొవిడ్ చికిత్స పేరుతో ఆస్పత్రుల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తొమ్మిది ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు అనుమతించారు. ఈ హాస్పిటల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు పూరై నిఘా కొనసాగుతుండగా… మిగిలిన వాటిల్లో త్వరలో సీసీ కెమెరాలు పెట్టనున్నారు. వైద్య సదుపాయాలు, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చారు.