Stalled Construction Of Gontheru Bridge: ఆ కాలువపై వంతెన కోసం సుమారు ఐదేళ్ల క్రితం భూమిపూజ చేసినా.. ఇప్పటికీ నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం మారిన అనంతరం రివర్స్ టెండరింగ్ పేరిట బ్రిడ్జి పనులు కాస్తా అటకెక్కాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు మరోసారి భూమిపూజ చేసి పనులు ప్రారంభించినా.. వంతెన నిర్మాణం మాత్రం వేగవంతం కాలేదు. ఆ ప్రాంత ప్రజల, రైతుల దశాబ్దాల నిరీక్షణ.. కలగానే మిగిలిపోతోంది.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం పరిధిలో గొంతేరు డ్రెయిన్‌పై చేపట్టిన వంతెన నిర్మాణం పనులు నాలుగేళ్లుగా ముందుకు సాగడం లేదు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.. వంతెన, అనుసంధాన రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అప్పటి మంత్రి నారా లోకేశ్.. బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించి భూమిపూజ చేశారు. కేంద్రం 16.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. కాగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రివర్స్ టెండర్ విధానం అమలుచేయడంతో.. పనులు ఆగిపోయాయి. 2020లో వంతెన నిర్మాణానికి.. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.. మరోసారి భూమిపూజ చేశారు. మూడేళ్లు గడుస్తున్నా.. పనుల్లో మాత్రం కదలిక లేదు.
మొగల్తూరు మండలంలోని కొత్తపాలెం, శేరేపాలెంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన రైతులకు.. ఈ గొంతేరు డ్రెయిన్ అవతల 2 వేల ఎకరాల భూములున్నాయి. నిత్యం రైతులు.. పొలం పనులు, పశుగ్రాసం, చేపల పెంపకం వంటి పనుల కోసం డ్రెయిన్ అవతలికి వెళ్లాల్సిందే. డ్రైయిన్ దాటేందుకు రేకు పడవల్ని ఉపయోగిస్తుండగా.. వర్షాకాలంలో ఉద్ధృత ప్రవాహాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకోవడం ప్రమాదకరంగా మారింది. వంతెన పూర్తైతే.. కష్టాలు తీరతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అది ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.