రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపునిచ్చారు.
20న శాసనసభ ముట్టడి: చంద్రబాబు
20:05 January 18
రాజధాని అంశం కేవలం రైతులకు మాత్రమే సంబంధించింది కాదని.. రాష్ట్ర ప్రజలందరికి, భవిష్యత్ తరానికి సంబంధించినదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 32 రోజులుగా రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని అన్నారు. మహిళలపై దాడులు చేస్తూ వారిని బూటుకాలుతో తన్నడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై దాడికి పాల్పడుతూ సీఎం జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ను సంతోష పెట్టేందుకు పోలీసులు బలిపశువులు అవుతున్నారని పేర్కొన్నారు. వీలైతే తమ కన్నా మెరుగ్గా పనిచేయాలని హితవు పలికారు. తెదేపా హయాంలో ఎవరైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. విశాఖ అంటే తనకు ఇష్టమని.. అక్కడి ప్రజలపై అభిమానం ఉందనీ చెప్పుకొచ్చారు.
ఈరోజు రాజధాని రైతులను మోసం చేసిన వ్యక్తులు భవిష్యత్తులో విశాఖ వాసులను మోసం చేయరని నమ్మకం ఏంటని ప్రశ్నించారు. ఆ ప్రాంతం మీద ప్రభుత్వానికి ఎలాంటి అభిమానం లేదని.. అక్కడి భూముల మీద వైకాపా కన్ను పడిందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని కాపాడుకునే బాధ్యత యువతపై ఉందన్నారు. అమరావతిని తరలిస్తే.. ప్రజలు వైకాపా నాయకులను బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను దోచుకునేందుకే రాజధాని మార్పును వైకాపా చేపట్టిందని ఆరోపించారు. ఈ నెల 20న అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నామని చెప్పారు.