జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను చూసుకుని రెచ్చిపోతున్నారంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం రాత్రి జనసేన, వైకాపా వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో ఆయన భీమవరంలో మాట్లాడారు.
‘పవన్ కల్యాణ్ సినిమాల్లో రకరకాల వేషాలు వేస్తారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా మేమెంత ఓర్పుగా ఉన్నామో ప్రజలు చూశారు. పార్టీ నాయకుడి తీరును బట్టే కార్యకర్తలు ఉంటారనడానికి జనసైనికుల తీరే నిదర్శనం. మత్స్యపురిలో దళిత మహిళను సజీవదహనం చేయాలని, దళితుల ఇళ్లను తగలబెట్టాలని చూశారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్తే నాపైనా దాడికి ప్రయత్నించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. పోలీసుల తీరూ జనసేనకు మద్దతిస్తున్నట్లుగా ఉంది’ . -భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
గురువారం రాత్రి మత్స్సపురిలో ఉద్రిక్తత గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. దాడులు చేసినవారిని 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే చలో మత్స్యపురి నిర్వహిస్తాం అన్నారు.