లాక్‌డౌన్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేక కొందరు బాధపడుతున్నారు. ఆంక్షలు ఎదుర్కొని అరటి గెలలను మార్కెట్‌కు తీసుకొస్తే కొనే నాథుడే కరువయ్యాడని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పండ్ల మార్కెట్‌లో లాక్‌డౌన్ కారణంగా మూడు నాలుగు గంటలు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఉన్న కారణంగా.. పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండటం లేదని అధికారులు చెపుతున్నారు.
రైతులనుంచి గెలలను కొనుగోలు చేయలేకపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. ఆరు గెలలు సైతం గతంలో 600 రూపాయలు ధర పలికితే ప్రస్తుతం 150 రూపాయలకు కొనుగోలు చేయటంలేదని రైతులు అంటున్నారు. ఫలితంగా.. గెలలు తోటలలోనే మగ్గిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.