సంక్రాంతి కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలో పదుల సంఖ్యలో బరులు తెరుచుకున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు విధించినా పందేలనిర్వహణకు స్థానికులు పట్టుబట్టడం, నేతలు అండదండలు ఉండటంతో.. పందేలు సాగనున్నాయి. కాకినాడలో గుడారిగుంట, గ్రామీణ ప్రాంతంలోని తిమ్మాపురం, సర్పవరం, నేమం, వలసపాకల, వాకలపూడి, పండూరు ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. ముమ్మడివరం నియోజకవర్గంలో కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. కొత్తలంక, రాజుపాలెం, కేసనకుర్రు, పిల్లంక,చెయ్యేరులో బరుల వద్ద గుండాట నిర్వహించుకునేందుకు జరిపిన వేలంపాటే 50 లక్షలకు వెళ్లిందంటే...ఇక్కడ కోడిపందేలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థమవుతోంది. ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం మండలాల్లోనూ పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ బరులు సిద్ధమయ్యాయి. పోలీసులు హెచ్చరిస్తున్నా నిర్వహకులు తమపని తాము చేసుకుంటూపోతున్నారు. భీమవరం, నిడమర్రు, పాలకొల్లు, లింగపాలెం, కామవరపుకోట, కాళ్ల, ఆకివీడు, దెందులూరు, ఉండి, నరసాపురం, కుక్కునూరు ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే పందేలు అన్నీ ఒక ఎత్తైతే వెంప, ఐ.భీమవరం, మహదేవపట్నంలో జరిగే పందేలు ఒక ఎత్తు. ఇక్కడ కోట్లలో పందేలుజరుగుతాయి ఇతర రాష్ట్రాల నుంచీ పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జీల్లో దిగారు.