Approval delay of revised estimates for Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.47,725 కోట్లతో సవరించిన అంచనాల పెట్టుబడి అనుమతికి మరింత ఆలస్యం తప్పేలా లేదు. ప్రాజెక్టు అథారిటీ ఈ మొత్తానికి సిఫార్సు చేస్తూ కేంద్ర జలశక్తిశాఖకు వర్తమానం పంపిన తర్వాతే ఓ అడుగు ముందుకు పడుతుంది. అలాంటిది అథారిటీ ఈ వ్యవహారంలో తాజాగా మళ్లీ మెలిక పెట్టింది. అంతకుముందు లేవనెత్తిన సందేహాలకు రాష్ట్ర జల వనరులశాఖ సమాధానాలు అందజేసినా వాటిని పరిశీలించి కొత్తగా కొన్ని కొర్రీలు వేసింది. దీంతో జల వనరులశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశం ఏడాదికి పైగా పెండింగులో ఉండటం గమనార్హం.
- పోలవరం ప్రాజెక్టువల్ల ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్ని నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో కచ్చితమైన లెక్కలతో మళ్లీ సమాచారం పంపాలని అథారిటీ కోరింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయా కుటుంబాల్లో యుక్త వయసువారు పెరుగుతున్నారని, దానివల్ల ఈ సంఖ్యలో ఎప్పటికప్పుడు మార్పు ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా కొన్నిచోట్ల సామాజిక ఆర్థిక సర్వే చేయాల్సి ఉంది. నిర్వాసిత కుటుంబాల జాబితాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది.
- పనులు చేపట్టవద్దంటూ కేంద్ర అటవీ పర్యావరణశాఖ గతంలో నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు ఈ స్టే ఎత్తి వేయిస్తూ పనులు చేయిస్తున్నారు. 2021 జులై 2 వరకే పనులకు అనుమతి ఉంది. పొడిగింపు ఇంకా రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ పనుల నిలిపివేత ఉత్తర్వులు తొలగించుకుని రావాలని సూచించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని కేంద్రం పేర్కొంది. అలాంటిది ఇప్పుడు పనుల నిలిపివేత ఉత్తర్వులు తొలగింపు అంశంలోనూ మెలిక పెడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 2013-14 అంచనాల మేరకు పెట్టుబడుల అనుమతులు ఇచ్చే క్రమంలో ఈ అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదని అథారిటీ వద్ద కొందరు ప్రస్తావించినట్లు సమాచారం. సానుకూల పరిస్థితులు లేకపోవడంవల్లే కొర్రీలపై కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అథారిటీ అడిగిన ప్రకారం అన్నీ పూర్తి చేసి ఇవ్వాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. మరోవైపు రూ.35,950 కోట్లకే పెట్టుబడులు ఇస్తామని కేంద్రం రాజ్యసభలో ఇప్పటికే ప్రకటించింది. దీనికీ పోలవరం అథారిటీ సిఫార్సు అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో వేస్తున్న ఈ కొర్రీలన్నీ ఇక్కడి యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
- కేంద్రం నుంచి రూ.2,000 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ప్రస్తుతం రూ.340 కోట్ల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చిందని సమాచారం. వచ్చే వారంలోగా ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. మరో రూ.371 కోట్లకు సంబంధించిన బిల్లుల ప్రక్రియ మరికొన్ని దశలు దాటింది. అవి కూడా మరికొన్ని రోజుల్లో రావచ్చని ఇటీవల ప్రాజెక్టుకు వచ్చిన కేంద్ర అధికారులు సమాచారాన్ని ఇచ్చారు.
- ఇంతకుముందు ప్రాజెక్టును 2021 మే నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి షెడ్యూలు ఇచ్చింది. ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూలు తయారు చేసి పంపాలని అథారిటీ సూచించింది.