పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురుశెట్టి రవిశ్రీతేజ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో సత్తా చాటాడు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంసెట్ ఫలితాల్లో టాపర్గా నిలిచాడు. ఇవేకాక జేఈఈలోనూ ఉత్తమ ఫలితాలు సాధించాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడే 'టాపర్' - ravi sri teja
ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించాలంటేనే చదువుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటిది తాడేపల్లిగూడెంకు చెందిన ఓ విద్యార్థి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచాడు. ఆ విజయం వెనుక కష్టాలను ఈటీవీ భారత్తో పంచుకున్నాడు.
12 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ
ఎంసెట్ ఫలితాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం వెనుక నిరంతర శ్రమ దాగి ఉందని అంటున్నాడు రవిశ్రీతేజ. పరీక్షల కోసం ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే రోజుకు 12 నుంచి 13 గంటల సమయం చదువుకు కేటాయించానని తెలిపాడు. పరీక్షలు దగ్గరికి వచ్చే కొద్దీ చదువుకునే సమయాన్ని తగ్గిస్తూ వస్తూ మెదడుకు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు, నడక వంటి వాటికి సమయం కేటాయించినట్లు వెల్లడించాడు.
విజయం మంత్రం అదే
పరీక్షలు దగ్గరపడే కొద్దీ అందరూ అన్ని పుస్తకాలు తిరగేస్తుంటారని అలా చదివితే ఉపయోగం లేదని రవిశ్రీతేజ తెలిపాడు. ప్రణాళిక బద్ధంగా చదవడం మొదలు పెట్టి, రాని సబ్జెక్టులపై దృష్టి పెడితే విజయం వరిస్తుందని వివరించాడు. పరీక్షకు వారం ముందు అసలు పుస్తకమే పట్టుకోకూడదని అంటున్నాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందని.. వారి ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించానని తెలిపాడు.