పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. గ్రామాల్లో 638 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. వీటిలో 158 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ వివిధ రకాల పంచాయతీ, ప్రభుత్వ, ప్రైవేటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం జిల్లాలోని 425 ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలని నిర్ణయించింది.
ఒక్కొక్క భవన నిర్మాణానికి 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం రూ. 97.75 కోట్ల మంజూరు చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ భవనాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలను కూడా భారతీయ ఆరోగ్య మండలి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 26 కోట్ల 72 లక్షల రూపాయలను మంజూరు చేసింది.