New Plan For Construction Of Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ సంవత్సరం ఏది పూర్తిచేయాలన్న దానిపై జగన్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామంటూ 2019 నవంబరులో ఒకసారి, 2020 సెప్టెంబర్‌లో మరోసారి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు.. వాటిపై సీఎం జగన్ వద్ద చర్చించారు. ఈ ప్రణాళికలు కొలిక్కి రాకపోగా, అప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయిన సంగం, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు.
ఈ ప్రభుత్వానికి ఇక ఏడాదిన్నర గడువే ఉంది. అసలు ప్రాజెక్టుల పూర్తికి ఎలా ముందుకెళ్లాలనే విషయంలో మళ్లీ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇకపై 75 శాతం పనులు పూర్తయిన వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందుకోసం ప్రాజెక్టులను 4 కేటగిరీలుగా విభజించి సమాచారం సేకరిస్తున్నారు. 50 శాతం కంటే తక్కువ పని జరిగినవి, 50 నుంచి 75 శాతం మధ్య పూర్తయినవి, 75 శాతం దాటి పూర్తయినవి, దాదాపు 100 శాతం పనులు కొలిక్కి వచ్చినవిగా ప్రాజెక్టులను విభజించారు. వీటన్నింటికీ ఇంకా ఎంత మొత్తం అవసరమనే సమాచారం సేకరిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ప్రాజెక్టులపై గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టింది. కొత్తగా టెండర్లు పిలిచి 20 శాతం లోపు పనులు పూర్తయిన వాటిని రద్దు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి, అవసరమైన కొన్నింటినే కొనసాగించాలని తీర్మానించింది. ఆ తర్వాత అనేక కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచింది. కృష్ణా వరద జలాలను రాయలసీమ జిల్లాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువగా మళ్లించాలనే ఆలోచనతో ప్రారంభించిన "సీమ కరవు నివారణ పథకం" అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. పాత, కొత్త ప్రాజెక్టులు పడకేశాయి. పెద్ద పెద్ద గుత్తేదారులు కూడా చేతులెత్తేశారు.