మంచినీటి సరస్సు... పూర్తిగా కలుషితమై ఉప్పునీటి సరస్సుగా మారిపోకముందే అధికారులు మేల్కొని కొల్లేరు సరస్సును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
సాగుతోంది వ్యాపారం... కొల్లేరుకు వీడని గ్రహణం
కొల్లేరు... ఆసియాలోనే మంచినీటి సరస్సుల్లో అతిపెద్ద సరస్సుగా పేరుగాంచింది. అంతటి పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ సరస్సు రొయ్యలసాగుతో... ఉప్పునీటి సరస్సుగా మారే పరిస్థితులు దాపురించాయి. కొల్లేరు పరిసరాల్లో జరుగుతున్న అక్రమ రొయ్యలసాగు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. క్రమక్రమంగా విస్తరిస్తున్న రొయ్యల సాగు... సరస్సు విస్తీర్ణాన్ని మింగేస్తోంది. మంచినీటి తటాకం కాస్త ఉప్పుగా మారిపోతుంది. టన్నుల కొద్ది ఉప్పు, రసాయనాలు మంచినీటిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు.
మంచినీటి సరస్సు... పూర్తిగా కలుషితమై ఉప్పునీటి సరస్సుగా మారిపోకముందే అధికారులు మేల్కొని కొల్లేరు సరస్సును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
' ఆపరేషన్ కొల్లేరు'తోనూ... ఆగని ఆక్రమణలు
కొల్లేరులో ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్న చేపల చెరువులను 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేశారు. ఆ తర్వాత కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్లేరు భూములను సంప్రదాయం ముసుగులో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. 2008 నుంచి నుంచి కైకలూరు, మండవల్లి మండలాల్లో కొట్టేసిన భూముల్లో కృత్రిమ చేపల సాగు ఏటా పెరుగుతోంది. ఈ మార్గంలోనే రొయ్యల సాగు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చెరువులు వెలిశాయి. ఈ సంగతి తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అటవీశాఖాధికారులపై ఉన్నాయి.
కొల్లేరు పరీవాహక ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే ఉప్పునీటి రొయ్యలసాగు ప్రస్తుతం కొల్లేరునే ఆక్రమించే స్థితికి చేరాయి. కాలుష్యం పెరుగుతోంది. ఈ సరస్సే ప్రాణంగా జీవిస్తున్న విలువైన నల్లజాతి చేపలు, అరుదైన పక్షులకు ఉప్పునీటితో నష్టం వాటిల్లుతుంది. వేల కిలోమీటర్ల నుంచి వస్తున్న విదేశీ పక్షులు ఆకలితో అల్లాడిపోతున్నాయి.
తీవ్ర రూపం దాల్చిన కాలుష్యంతో నీటిలో హానికరమైన క్రిమిసంహారక అవశేషాలు, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్లు, భారీ లోహ అవశేషాలు, రసాయనాల నీటితోపాటు కొల్లేరు భూములు విషతుల్యమవుతున్నాయి.
కొల్లేరులో జరుగుతున్న అక్రమాలను అటవీ శాఖాధికారులు పూర్తిస్థాయిలో నిలువరించకపోతే సరస్సు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు కొల్లేరు పరిరక్షణకు ముందుకు రావాలని కోరుతున్నారు.