ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్సే ఆసుపత్రి.. బయటే పడక.. ఆవరణలోనే నిరీక్షణ - today Ambulance hospital in eluru news update

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొందరు తక్కువ లక్షణాలతో ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. మరికొందరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అక్కడ పడకల సమస్యతో ఇక్కట్లు పడుతున్నారు.

అంబులెన్సే ఆసుపత్రి
అంబులెన్సే ఆసుపత్రి

By

Published : May 18, 2021, 1:18 PM IST

జిల్లా ఆసుపత్రికి ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి బాధితులు తరలి వస్తున్నారు. వీరిలో చాలా మందికి గంటల తరబడి ఎదురుచూసినా పడక దొరకడం లేదు. వారు ఆవరణలోని సిమెంటు బల్లలపై, చెట్ల నీడనే నిరీక్షిస్తున్నారు. ఇంకొందరు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకొని వేచిచూస్తున్నారు. సిలిండర్లు ఖాళీ అవుతున్నా కొన్ని సందర్భాల్లో పడక మాత్రం దక్కడం లేదు. వీరితో పాటు వచ్చిన బంధువుల పరిస్థితి వర్ణనాతీతం. కొవిడ్‌ బాధితులెవరో.. సాధారణ ప్రజలెవరో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

వాహనంలోనే వెనక్కు

కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో పడకలు ఖాళీ అయిన వెంటనే మళ్లీ నిండిపోతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పడక దొరుకుతుందనే నమ్మకం లేదు. కొందరు రాజకీయ, ఇతర పలుకుబడితో సంపాదిస్తున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన 15 నిమిషాల్లో పడక ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అంబులెన్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి వచ్చిన బాధితులు గంటలకొద్దీ పడక కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల బంధువులు సిబ్బంది చుట్టూ తిరగడంతో ఎప్పటికో వైద్య సిబ్బంది వాహనాల్లో వచ్చిన బాధితుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. శ్వాస, ఇతర లక్షణాల తీవ్రతను బట్టి ఇబ్బంది లేదనుకున్న వారికి ఇంజెక్షన్‌, మందులు ఇచ్చి ఇంట్లో ఉండమని.. ఆసుపత్రిలో చేర్చుకోకుండానే వెనక్కు పంపిస్తున్నారు. దీంతో కొందరు బాధితులు ఇంటిముఖం పడుతుండగా.. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. స్తోమత లేనివారు మాత్రం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఏలూరు పవర్‌పేటకు చెందిన ఓ వ్యక్తికి శ్వాస సమస్య ఎక్కువ కావడంతో సోమవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది పడకలు నిండుకున్నాయని చెప్పడంతో అంబులెన్సులోనే ఆక్సిజన్‌ పెట్టుకుని ఉన్నారు. సాయంత్రం వరకూ ఉన్నా పడక దొరకలేదు. ఇలాంటి బాధితులు రోజూ ఆసుపత్రి ఆవరణలో అనేక మంది కనిపిస్తున్నారు.

అంబులెన్సులో బాధితుడి నిరీక్షణ

1,185 కేసులు.. 16 మరణాలు

జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,185 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. పలు కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 16 మంది మరణించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో జిల్లాలోనే అత్యధికం. మహమ్మారి నియంత్రణలో భాగంగా జిల్లాలో దాదాపు 13 లక్షల మందికి జ్వర సర్వే నిర్వహించాల్సి ఉంది.

ఇవీ చూడండి…

ఆంక్షలు ఉల్లంఘిస్తున్న వారిపై.. కఠిన చర్యలు

ABOUT THE AUTHOR

...view details