ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

alluri jayanthi: చిన్నప్పటి చిట్టిబాబు..ఆ తర్వాత ఏమయ్యాడు!

అల్లూరి సీతారామరాజు.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ పోరాట చరిత్ర. బ్రిటిష్ వాళ్లను గజగజలాడించిన విప్లవ కెరటం. మన్యంలో సమరానికి సై అంటూ.. ఎగిసిపడిన నిప్పు కణిక. సమరనాదానికి రూపం ఇస్తే.. విప్లవ నినాదానికి ఆయువు పోస్తే.. కనిపించే రూపం.. అల్లూరి. మన్నెం ప్రజల కోసం పోరాడిన అమరుడు.. అల్లూరి కథ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. నేడు ఆయన జయంతి..

By

Published : Jul 4, 2021, 11:06 AM IST

Updated : Jul 4, 2021, 11:57 AM IST

alluri sitarama raju birth anniversary
alluri sitarama raju birth anniversary

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన మన్యం వీరుడు.. అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. బ్రిటిషు పాలకులను ఎదిరించిన సాయుధ పోరాట యోధుడు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన పోరాటం.. ఓ ప్రత్యేక అధ్యాయం. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 1924 మే 7వ తేదీన 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. నేడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహావీరుడిని ఒకసారి స్మరించుకుందాం.

సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు. కానీ అల్లూరి జన్మించింది మాత్రం.. విజయనగరం దగ్గరి పాండ్రంగిలో ఉంటున్న తాతగారు మందలపాటి శ్రీరామరాజు ఇంట. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

ఆరో తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్లి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు.

అల్లూరి కుటుంబం చాలా రోజులు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూశాడు.

ఉత్తర భారతదేశ యాత్ర

1916 ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు అల్లూరి సీతారామరాజు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఎన్నో ప్రదేశాలు చూశాడు. 1918లో మళ్లీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవుపేట చేరాడు.

ధైర్యాన్ని నింపేవాడు

ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు.

పోరాటానికి సిద్ధం చేశాడు

చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. అతడి అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

అప్పుడే విప్లవం ప్రారంభం

అప్పటికే.. ప్రజలపై తెల్లదొరల దోపిడీ చూసి రగిలిపోతున్న అల్లూరి సీతారామరాజు విప్లవం మెుదలుపెట్టారు. 1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్లారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసారని చెప్తుంటారు. ఆ సమయంలో స్టేషన్​లో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. అలా బ్రిటిష్ ప్రభుత్వానికి చాలారోజులు కంటిమీద కునుకు లేకుండా చేశాడు అల్లూరి సీతారామరాజు.

రూథర్ ఫర్డ్ ఎంట్రీ

17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు. 1924 మే 6న విప్లవకారులలో ఒకరిని బంధించారు. ఆయన శిక్ష అనుభవిస్తూనే మరణించాడు. అదే రోజు రాత్రి సీతారామరాజు రాజు మంప గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలోనే కృష్ణదేవుపేటలో రూథర్ ఫర్డ్ సభ పెట్టి.. విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. అప్పుడే తన వల్ల మన్యం ప్రజలు ఇబ్బందులు పడకూడదని రారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.

తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట రాజు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు. అలా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

ఇదీ చదవండి:KP ONION: కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి

Last Updated : Jul 4, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details