young man dies in America: అమెరికాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఏలూరుకు చెందిన వీర సాయి అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఆ యువకుడు రెండు సంవత్సరాల క్రితం చదువు నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ పార్ట్ టైం కింద పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఈ తరుణంలో వెస్ట్ కొలంబస్ లో కొందరు గుర్తు తెలియని దుండగులు డబ్బు కోసం ఆ యువకుడి పై అమానుషంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12:50 గంటలకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో సాయి హత్యకు గురైనట్లు ఇక్కడికి సమాచారం అందింది.
ఏలూరులో విషాద ఛాయలు... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాయి కుటుంబం ఏలూరులో స్థిరపడ్డారు. సాయి తండ్రి ఎల్వైఆర్.. సీఆర్ఆర్ కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇటీవల ఆయన మృతి చెందగా.. ఇద్దరు కుమారుల్లో చిన్న వాడైన సాయి అమెరికాలో చదువుతున్నాడు. ఈ విషాద సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్లు నివసిస్తున్న అపార్ట్మెంట్ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో చదువుకున్న తెలుగు విద్యార్థులపై ఇటువంటి సంఘటన జరుగుతున్నాయని.. తమ కుమారుడికి జరిగినట్లు ఇతర విద్యార్థులు ఎవరికీ జరగకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులకు కోరుతున్నారు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వగృహానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.