పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన లోవా వెంకటేశ్ యాభై ఆరు ఎకరాల చేపల చెరువును లీజుకు తీసుకున్నట్లు నకిలీ అగ్రిమెంట్ సృష్టించాడు. దానిని ఆధారంగా చూపించి ఏలూరులోని సిండికేట్ బ్యాంకులో 2015లో కోటి రూపాయల పైగా రుణాన్ని పొందాడు. అసలు భూయజమాని క్రాప్ లోను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లగా అప్పటికే ఆ భూమిపై లోన్ తీసుకున్నారని చెప్పారు.
విషయం వెలుగులోకి ఇలా...
భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన ఆరేటి జగన్మోహన్రావు సింగరేణి కోల్‌మైన్ లో ఉద్యోగిగా పని చేసి 2012లో మృతి చెందాడు. అతని పేరు మీద ఉన్న భూమిని ఆయన భార్య అరుణ పేరు మీదకు మార్పించుకున్నారు. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కూడా అధికారులు ఇచ్చారు. గత ఏడాది జూన్‌లో వ్యవసాయ రుణం కోసం ఆంధ్రా బ్యాంకు అధికారులను సంప్రదించగా.. ఇప్పటికే మీరు సిండికేట్ బ్యాంకులో కోటి రూపాయలు రుణం పొంది ఉన్నారని చెప్పడంతో అరుణ కుమారి విస్తుపోయారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఏలూరులోని సిండికేట్ బ్యాంక్ అధికారులను సంప్రదించారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 28న బ్యాంకు ఆవరణలో ఆందోళన చేశారు.