పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ మాధవకుంట పుష్కరిణిలోకి ఓ వ్యక్తి దూకాడు. ఆ వ్యక్తి చాలాసేపటి వరకు పైకి రాకపోవడం వల్ల స్థానికులు.. పోలీసులు, దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఆలయ సిబ్బంది, పోలీసులు పుష్కరిణిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్ల సహాయంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే అతడు పుష్కరిణిలో దూకే సమయంలో వద్దని స్థానికులు కేకలు వేసినా అతడు పట్టించుకోలేదని, నిన్నటినుంచి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు పెదపాడుకు చెందిన వీరాంజనేయులుగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.