ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2020, 5:03 PM IST

ETV Bharat / state

చింతలపూడిలో కిడ్నాప్ కలకలం

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో కిడ్నాప్ కలకలం రేగింది. తనను, తన భార్యను, కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కొందరు యత్నించారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

kidnap
kidnap

చింతలపూడిలో కిడ్నాప్ కలకలం

తనను, తన భార్యను, కుమార్తెను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు కొందరు యత్నించారంటూ తాడేపల్లిగూడెంకు చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి గురువారం చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీల తగాదాలతో తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించాడు. అతను తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాడేపల్లిగూడెంకు చెందిన శివప్రసాద్, అతని భార్య షాజా, మూడేళ్ల కుమార్తెను కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చింతలపూడి మండలం ఫాతిమాపురం సమీపంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి శివప్రసాద్ తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చింతలపూడి పోలీసుస్టేషన్​కు వచ్చాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కారుతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వాళ్లకు, తనకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ ఉందని శివప్రసాద్ చెప్పాడు. ఈ విషయంపై హైదరాబాద్​లో కేసు నడుస్తోందని వెల్లడించాడు. ఈ క్రమంలో తమను బలవంతంగా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.

దీనిపై మరో వర్గం వారు మాట్లాడుతూ... శివప్రసాద్ మలేషియాలో వస్త్ర వ్యాపారం చేస్తున్నానని చెప్పి నమ్మించి తమ వద్ద నుంచి 1.86 కోటి రూపాయల విలువైన వస్త్రాలను తీసుకున్నాడని తెలిపారు. ఏడాది దాటినా తమకు నగదు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. దీనిపై మాట్లాడేందుకే హైదరాబాద్​కు తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న చింతలపూడి పోలీసులు... వారిని తాడేపల్లిగూడెం పోలీసు స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి

రాజమహేంద్రవరం: తరగతి గదిలో మైనర్ల వివాహం!

ABOUT THE AUTHOR

...view details