స్నేహితురాలి మోసం.. తీసింది ప్రాణం
14:38 January 12
ఏడాదిన్నర బాబు సహా దంపతుల ఆత్మహత్య
స్నేహం ముసుగులో జరిగిన ఆర్థిక మోసాన్ని తట్టుకోలేక ఏడాదిన్నర బాబుతో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పాలకోడేరు ఎస్సై ఏజీఎస్ మూర్తి కథనం ప్రకారం.. భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన సీడే పరశురాముడు (45), ధనసావిత్రి (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. సావిత్రి స్నేహితురాలైన అత్తిలికి చెందిన చోడిశెట్టి హైమావతి అధిక వడ్డీ ఇస్తానని.. పది రోజులకోసారి సొమ్ము చెల్లిస్తానని వీరిని నమ్మించింది. దీంతో పరశురాముడు దాచుకున్న సొమ్ముతో పాటు తన బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.25 లక్షల వరకు అప్పు ఇప్పించాడు. హైమావతి వారం కిందట సొమ్ముతో పరారవడంతో ఈ దంపతులు తట్టుకోలేకపోయారు.
తమను నమ్మి అప్పు ఇచ్చిన వారు కూడా మోసపోయారంటూ ఆవేదన చెందేవారు. మంగళవారం ఉదయం భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఏడాదిన్నర వయసున్న కుమారుడు నాగవెంకట శ్రీనివాస్‌తో సహా ఇంటి నుంచి బయలుదేరారు. కుముదవల్లి శివారులో జామాయిల్ తోటలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందును తొలుత కుమారుడికి తాగించారు. ఆపై వారూ తాగారు. స్నేహితురాలైన హైమావతి చేసిన మోసాన్ని తట్టుకోలేకే చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్‌లో వాయిస్ మెసేజ్ పంపించారు. ‘మేం ఎవర్నీ మోసం చేయలేదు. ఎవరి సొమ్మూ మా వద్ద లేదు. చనిపోయాక మమ్మల్ని ఎవరూ తిట్టుకోవద్దు. మాకు రావాల్సిన డబ్బు తీసుకుని బాకీదారులకు చెల్లించండి’ అని ఆ దంపతులు విలపిస్తూ మెసేజ్ పంపించారు. తొలుత తామిద్దరమే చనిపోదామని అనుకున్నామని.. తాము లేకుంటే అనాథగా మిగులుతాడనే భయంతో బిడ్డను కూడా తీసుకెళ్తున్నట్లు చెప్పిన మాటలు అందరి హృదయాలను కదిలించాయి. హైమావతి మరికొంత మంది నుంచి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదకర ప్రయాణం..మోపెడ్‌పై రైతు విన్యాసం