పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తలో నిడమర్రు సుశీలకు చెందిన 27 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్సై కె. రామారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుశీల, ఆమె కుటుంబ సభ్యులకు గ్రామంలో రెండు సొంతిళ్లు ఉన్నాయి. వారంతా ఈనెల 11 న రాత్రి 10 గంటలకు మరో ఇంటికి వెళ్లారు. తెల్లారి తిరిగి మెుదటి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించారు.
ఆందోళనతో వారు ఇంట్లో పరిశీలించగా బీరువాలో ఉన్న సుమారు రూ. 9 లక్షల విలువైన 27 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కొవ్వూరు డీఎస్పీ బి. శ్రీనాథ్, తణుకు సీఐ చైతన్యకృష్ణ ఘటన స్థలిని, చోరీ జరిగిన తీరు పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.