విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 3 జడ్పీటీసీ , 55 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు మరణించిన కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 1879 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణ కోసం 15 మంది నోడల్ ఆఫీసర్లు, 34 మంది రిటర్నింగ్ అధికారులు, 68 మంది ఏఆర్ఓలు, 142 మంది జోనల్ అధికారులు, 248 మంది రూట్ ఆఫీసర్లు, 68 ఎస్ఎస్ టీమ్స్, 54 ఎఫ్ఎస్ టీమ్స్, 34 మండల ఎంసిసి బృందాలు, 959 గ్రామస్థాయి ఎంసిసి బృందాలు, 213 మంది మైక్రో అబ్జర్వర్స్, 2067 మంది పీఓలు, మరో 2067 మంది ఏపీఓలు, 6,211 మంది ఇతర పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 6వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసారు. 213 సున్నిత ప్రాంతాలు, 183 అతి సున్నిత ప్రాంతాలు, 99 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రాష్ట్రమంతటా ఒకే విడతలో ఎన్నిక జరగనుండటంతో పోలీసులు, ఎపీఎస్‌పీ తదితర ప్రత్యేక దళాలతోపాటు, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, తూనికలు కొలతశాఖ సిబ్బంది, రవాణాశాఖ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు అందచేశారు.
కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి దంపతులు ఓటు వేశారు.