విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లి గ్రామంలో తిరుపతిరావు అనే రైతు జెడ్బీఎన్ఎఫ్(జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్) పద్ధతిలో పంట సాగు చేస్తున్నారు. 80 సెంట్ల భూమిని చదును చేసి... జిల్లాలో తొలిసారిగా సూర్యమండలం ఆకారంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు.
జెడ్బీఎన్ఎఫ్ సాగులో ఉత్తమ రైతు..
ఇటీవల మామిడితోటను జెడ్బీఎన్ఎఫ్ తరహాలో చేసి జులైలో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. అదే స్ఫూర్తితో కూరగాయలు పండించే విధానంలో మెళకువలు తెలుసుకొని సాగు మొదలుపెట్టారు. బీడు భూమిని సైతం ఉపయోగకరంగా మార్చారు. శుద్ధమైన విత్తనాలు వేసి, నీటి ద్వారా జీవామృతం వదులుతూ పంటలు పండించడం ప్రారంభించారు. జెడ్బీఎన్ఎఫ్ సభ్యుల సహకారంతో చీడపీడలకు తగిన జీవ, ఘనామృతాల తయారీ నేర్చుకుని పంటలపై పిచికారి చేశారు. ఈ ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడితోపాటు పోషకాలు అధికంగా దొరుకుతాయి. సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలకు మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్నందున మరికొంత మంది రైతులు ఇదే పద్ధతి పాటిస్తున్నారు.