చల్లా రాము.. విజయనగరం జిల్లా కొండవెలగాడ నివాసి. పోలియో కారణంగా పుట్టుకతోనే దివ్యాంగుడు అయిన రాము.. 1994లో విజయనగరంలో జరిగిన జాతీయ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను తిలకించాడు. అక్కడ యువతులు పోటీలో పాల్గొనడం చూసి... తన చెల్లిని వెయిట్ లిఫ్టర్‌గా చూడాలని కాంక్షించాడు. తల్లిదండ్రులను ఒప్పించి ఆమెకు విజయనగరంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఈ క్రమంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడపై అవగాహన పెంచుకున్న రాము... తన సోదరి జాతీయ క్రీడాకారిణిగా ఎదగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కానీ ప్రమాదవశాత్తు చెల్లెలు అకాల మరణంతో రాము కుంగిపోయాడు.
కొంత కాలం తర్వాత కోలుకున్న రాము చెల్లెలు జ్ఞాపకార్ధంగా గ్రామంలోని ఔత్సాహిక యువతులను వెయిట్ లిఫ్టర్లుగా తయారు చేయాలని సంకల్పించాడు. ఇందుకోసం వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు బీపెడ్ పూర్తి చేసి... కొందరు వెయిట్ లిప్టింగ్ కోచ్‌ల వద్ద శిక్షణ పొందాడు. అనంతరం 1997లో కొండవెలగాడలో వెయిట్ లిప్టింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. అనివార్య కారణాల వల్ల కొంత కాలం విరామం తీసుకున్నా 2005 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వందల మంది గ్రామీణ యువతీయువకులకు వెయిట్ లిప్టింగ్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.