Youngman Murder: తన ప్రేమ వ్యవహారానికి అడ్డు తగులుతున్నాడనే కారణంతో స్నేహితుణ్ని హత్య చేసి.. రైలు ప్రమాదంగా చిత్రీకరించిన వాలంటీరు చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. డీఎస్పీ టి.త్రినాథ్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన బి.బ్రహ్మాజీ (బాలు) డిగ్రీ పూర్తిచేసి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అతడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెతో మాట్లాడేందుకు టి.నవీన్(19) అనే స్నేహితుడి ఫోన్ వాడేవాడు. అతడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
బాలు మాట్లాడి వెళ్లిపోయాక.. నవీన్ తాను కాల్ చేసి ఆమెతో మాట్లాడేవాడు. ఈ విషయం బాలుకు తెలియడంతో హెచ్చరించాడు. అందుకు నవీన్.. ‘వాలంటీరు పేరుతో నువ్వు చేసే పాపాలతో పోలిస్తే నేను చేసే దాంట్లో తప్పేం లేదు’ అంటూ ఎదురు దాడి ప్రారంభించాడు. ‘సంక్షేమ పథకాలు, పింఛన్ల పేరుతో వాలంటీరు ముసుగులో కొందరు అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకున్న నువ్వా చెప్పేది? నీ అవసరాలు, ఎదుగుదల కోసం కొందరు యువకులను మత్తుకు బానిసల్ని చేశావు.. అవన్నీ బయట పెడతా’ అని హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వైరం ముదిరింది.