నూతన ఆవిష్కరణలతో ప్రతిభ కనబరుస్తోన్న శంకరరావు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలసకు చెందిన యువకుడు ఉంగట్ల శంకరరావు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన అతను బొబ్బిలి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేశాడు. కొన్నాళ్లు సమీప పారిశ్రామికవాడలో పనిచేశాడు. ప్రస్తుతం సొంతూరిలోనే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ తండ్రి నారాయణరావుకు పొలం పనుల్లో సహాయం చేస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం యంత్రాలు, పరికరాలు అద్దెకు తీసుకురావటం... వాటికి చెల్లించే అద్దె కోసం తండ్రి ఇబ్బంది పడడం ఆ యువకుణ్ని ఆలోచనలో పడేసింది.
ఐటీఐ పరిజ్ఞానంతోనే..
ఐటీఐ చదివిన అనుభవంతో తానే యంత్రాలు ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. పురుగుల మందు పిచికారి చేసే స్ప్రేయర్, గడ్డి తొలగించే పరికరం, వరి నూర్పిళ్లకు ఉపయోగించే పంకా, మూడు చక్రాల సైకిల్ వంటి వాటిని అతి తక్కువ ఖర్చుతో తయారుచేశాడు.
పనికిరాని వాటినే పనికొచ్చేలా
పనికిరాని, వాడిపడేసిన వాటితోనే సాగుకు పనికివచ్చే యంత్రాలు తయారుచేశాడు శంకరరావు. చిన్నపిల్లలు తొక్కే పాత సైకిల్‌ను బరువులు మోసే బండిగా మలిచాడు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వెళ్లలేని ప్రదేశాలకు దీన్ని తీసుకెళ్లొచ్చు. ఈ బండి తయారీకి వెయ్యి రూపాయలు ఖర్చైంది. 20 లీటర్ల తాగు నీటి డబ్బాను పిచికారి యంత్రంగా మలిచాడు. 2 వేల రూపాయల ఖర్చుతో తయారైన దీని ద్వారా దాదాపు 4 గంటలపాటు పొలంలో పిచికారి చేయవచ్చని చెబుతున్నాడు. ఒకే మోటారు యంత్రంతో దాదాపు ఏడు రకాల పనులకు వినియోగించేలా ఒక పరికరాన్ని రూపొందించాడు.
ప్రోత్సాహమందిస్తే మరిన్ని..
ప్రభుత్వం ప్రోత్సాహం లభిస్తే తన నైపుణ్యానికి మరింత పదును పెడతానని... చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే మరిన్ని యంత్ర పరికరాలు రూపొందిస్తానని శంకరరావు చెబుతున్నాడు. శంకరరావు యంత్ర నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని మెట్టవలస గ్రామస్థులు, రైతులు అభినందిస్తున్నారు. తనకున్న కొద్దిపాటి చదువు జ్ఞానంతోనే.. వాడి పడేసిన వస్తువులతో.. సాగుకు అవసరమయ్యే పరికరాలు తయారుచేస్తున్న శంకరరావు ప్రయాణం అభినందనీయం.
ఇవీ చదవండి:
పెళ్లి పీటలపైనే భర్తకు బడితపూజ చేసిన భార్య