విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. వినియోగదారుడు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న దుకాణం నుంచి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మద్యం కొనుగోలు చేశాడు. పక్కనున్న గట్టుపై కూర్చుని సీసా మూత తీయడానికి ప్రయత్నించాడు. అందులో కనిపించిన పురుగును చూసి అవాక్కయ్యాడు.
సీసాలో పురుగు ఉందని.. మరొకటి ఇవ్వాలంటూ దుకాణాన్ని సంప్రదించానని కార్మికుడు తెలిపాడు. దానిని తాము తయారు చేయలేదని.. డబ్బు తిరిగి ఇచ్చేది లేదని విక్రయదారుడు సమాధానమిచ్చాడని తెలిపాడు. చేసేదేమీ లేక మద్యం సీసాను వారికే తిరిగి ఇచ్చేశానన్నాడు. ఈ ఘటనపై జిల్లా డిపో మేనేజర్ సుధీర్ని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆ సీసాను సదరు కంపెనీకి పంపిస్తామని తెలిపారు.