గతేడాది సరిగ్గా ఇదే రోజు అంటే మే ఆరో తేదీ. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా బారిన పడటం కలకలం రేపింది. అదే తొలి కేసు. అక్కడి నుంచి కేసుల సంఖ్య వందలు.. వేలకు చేరి ప్రస్తుతం వీటి సంఖ్య 54,819. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు 12,159 కేసులు నమోదు కాగా 79 మంది చనిపోయారంటే కరోనా రెండో దశ ఉద్ధృతిని అర్థం చేసుకోవచ్ఛు ఏడాది కాలంలో నమోదైన కేసుల్లో 22.67 శాతం ఈ 34 రోజుల్లోనై నమోదు కావడం గమనార్హం.
ఉద్యోగులు సైతం వైరస్ బారిన..
వివిధ శాఖల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారు. కొందరు మృతి చెందారు. ఈ ఏడాది కాలంలో వైద్య, ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది సుమారు 352 మంది వైరస్ బారిన పడగా.. పది మంది వరకు మృతి చెందారు. విద్యాశాఖలో ఈ రెండు నెలల్లో సుమారు 70 మంది ఉపాధ్యాయులకు వైరస్ సోకగా.. 20 మంది వరకు చనిపోయారు. విజయనగరం నగరపాలక సంస్థలో 18 మంది, సచివాలయ కార్యదర్శులు 37 మంది, వాణిజ్య పన్నుల శాఖలో 12 మంది, పశుసంవర్ధక శాఖలో 26, వ్యవసాయ శాఖలో 23 మంది, జిల్లావ్యాప్తంగా 50 మంది వరకు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు 98 మంది కొవిడ్ బారిన పడ్డారు.
పట్టణాల్లోనే అధికం..
జిల్లాలో 53 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఒక్క విజయనగరంలోనే 17878 మంది వైరస్ బారిన పడ్డారు. పార్వతీపురంలో 3438, సాలూరులో 3475, బొబ్బిలిలో 3447 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా భోగాపురం మండలంలో 359 మంది కొవిడ్‌కు చిక్కారు. పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం.. పని లేకున్నా బయటకు రావడమే ఇందుకు కారణం.
మృతుల్లో వృద్ధులే ఎక్కువ..
కొవిడ్‌తో చనిపోతున్న వారిలో వృద్ధులే ఎక్కువ. వైరస్ బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నా వెంటనే కోలుకుంటున్నారు. చాలామంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వాటితో బాధపడుతుంటారని, అలాంటి వారే ఎక్కువగా చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 297 మంది మృతి చెందగా.. ఇందులో 60 ఏళ్ల పైబడిన వారు 141 మంది ఉన్నారు.