ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు సృష్టిస్తున్న వివాదాలను సమర్థవంతగా ఎదుర్కొంటున్న ఆ ప్రాంత గిరిజనులను విజయనగరంజిల్లా కలెక్టర్ సూర్యకుమారికి, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, తదితర అధికారులు ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్ కు విచ్చేసిన కొఠియా గ్రామాల ప్రజలను జిల్లా అధికారులు మేళ తాళాల నడుమ, సన్నాయి వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానించారు. తామంతా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటామని చేసిన తీర్మాన పత్రాలను కలెక్టర్ సూర్యకుమారికి కొఠియా గ్రామాల ప్రజలు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో కొనసాగించాలని కలెక్టర్ కు కొఠియా వాసులు విన్నవించుకున్నారు.
కొఠియా గ్రామాల నుంచి ఇంతమంది ధైర్యంగా వచ్చి ఆంధ్రలోనే ఉంటామని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల్లో వివాదాలు గత కొన్నేళ్లుగా సాగుతున్నాయని, వీటికి సంబంధించిన పాత నివేదికలన్నీ పరిశీలించామని వెల్లడించారు. ఇది చాలా సున్నితమైన సమస్య.. దీన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని తెలిపారు.