వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో ప్రవహించే నదులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ప్రధానంగా గోముఖి, గోస్తనీ, వేగావతి, చంపావతి, సువర్ణముఖి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండ కోనల్లో కొలువైన జలపాతాలు సైతం గలగల పారుతున్నాయి. మెంటాడ మండలం వాణజ, పాచిపెంట మండలం ఆలూరు, సాలూరు మండలం శిఖపుర, లొద్ద, గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ జలపాతాలు జోరుగా ప్రవహిస్తున్నాయి. పలు నదులు అటవీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే క్రమంలో పలుచోట్ల ఎత్తైన కొండలు, కోనలు నుంచి జాలువారుతూ జలపాతం రూపంలో కనువిందు చేస్తున్నాయి. సహజసిద్ధంగా వెలసిన ఈ జలపాతాలు, ప్రకృతి సోయగం మధ్య పర్యాటకులను కట్టేపడిస్తూ మనస్సును మైమరిపిస్తున్నాయి. ప్రకృతి అందాల మధ్య నెలకొన్న జలపాతాలను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్తున్నారు.
మేఘం కరిగింది... ప్రకృతి పరవశించింది! - vizianagaram district latest news
ప్రకృతి అందాలను తిలకించేందుకు మబ్బులు కిందికి దిగివచ్చాయేమో...! పచ్చని కొండలతో ముచ్చట్లు పెట్టుకున్నాయేమో అనిపించేలా కొలువైన సుందర దృశ్యాలు ఓ వైపు. చుట్టూ పచ్చదనంతో నిండిన పర్వతాలు, ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రకృతి అందాలు, వాటి మధ్య నుంచి గలగల పారే జలపాతాలు మరోవైపు. ప్రకృతి రమణీయతలో సహజంగా కొలువుదీరిన జలపాతాలను చూస్తూ ముచ్చట పడతున్న కుర్రకారు ఇంకో వైపు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తాజాగా కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో జలపాతాలు ఇంతగా కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తున్నాయి.
స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో స్నానాలు చేస్తూ ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. తమ చరవాణుల్లో స్వీయ చిత్రాలను బంధిస్తూ మైమరిచిపోతున్నారు. తాజాగా కురిసిన వర్షాలకు విజయనగరంజిల్లాలోని పలు ప్రాంతాల్లోని జలపాతాలు ప్రకృతి అందాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాలకు వచ్చిన వారు ఎవరైనా మళ్లీమళ్లీ రావాలని అనిపించేలా ప్రకృతి సోయగాలు కట్టిపడేస్తున్నాయి. అన్ని వయస్సుల వారినీ మైమరిపిస్తున్నాయి. కేవలం పరిసర గ్రామాల వారే కాకుండా విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాకు చెందిన పర్యాటకులూ పిక్నిక్ స్పాట్‌గా కొలువుదీరాయి ఈ జలపాతాలు.