ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ ప్రమాణాలతో విజ్జీ మైదానం ముస్తాబు - విజ్జీ స్టేడియం వార్తలు

విద్య, కళలు, క్రీడలకు విజయనగరం పుట్టినిళ్లులాంటింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన ఘనత విజయనగరానిది. దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రికెట్ క్రీడను పూసపాటి వంశీయులు విజయానంద గజపతి రాజు(విజ్జీ)... జిల్లాకు పరిచయం చేశారు. ఒకప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన విజ్జీ స్టేడియం ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ముస్తాబవుతోంది.

Vizzy ground
Vizzy ground

By

Published : Sep 26, 2020, 7:33 PM IST

విజయనగరం శివారున ఉన్న విజ్జీ క్రీడా మైదానంలో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. 16 లక్షల రూపాయల వ్యయంతో మైదానం మరమ్మతులు చేపడుతున్నారు. గతంలో రంజీ మ్యాచ్​లకు అతిథ్యమిచ్చిన విజ్జీ స్టేడియం... కొన్నేళ్లుగా స్థానిక మ్యాచ్​లకు పరిమితమైంది. మైదానం చుట్టూ ఉన్న ఇనుప కంచె మరమ్మతులకు గురి కావటంతో బంతి బయటకు వెళ్లే పరిస్థితితో క్రికెట్ క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు. అలాగే వారు ప్రాక్టీస్ చేసేందుకు సరైన నెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో గతేడాది నూతనంగా ఏర్పాడిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ పాలకవర్గం... క్రీడాకారుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మీనారాయణ రాజు, ట్రెజరర్ పెనుమత్స సీతారామరాజులు క్రికెట్ మైదానం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 16లక్షల రూపాయల వ్యయంతో మైదానం మరమ్మతులతో పాటు.. నెట్స్, డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో..

ఆరు ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ మైదానం చుట్టూ నూతనంగా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. వర్షపు నీరు మైదానంలో రాకుండా మళ్లించేందుకు వీలుగా చుట్టూ కాలువలు నిర్మించారు. అంతేకాకుండా మైదానం ఆఫ్ ఫీల్డ్ మొత్తాన్ని పూర్తిగా దున్నించి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ఆట జరిగే సమయంలో క్రీడాకారులు కూర్చొనేందుకు రెండు డగౌట్లు ఏర్పాటు చేశారు. సామాన్లు భద్రపరిచే గది నిర్మించారు. అదేవిధంగా క్రికెట్ ఆటగాళ్లు శారీరకంగా కసరత్తులు చేసేందుకు అవసరమైన జిమ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. విజ్జీలో మైదానం అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వస్తే.. జిల్లా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే అవకాశం కూడా లభిస్తుందన్నారు క్రికెట్ కోచ్​లు.

మట్టిలో మాణిక్యాల కోసం...

జిల్లా క్రికెట్ అసోసియేషన్ పాలకవర్గం మరోవైపు గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని ఉపకేంద్రాల అభివృద్ధిపైనా దృష్టి సారించింది. మొదటి విడత విజయనగరం, గరివిడి, గజపతినగరం, ఎస్.కోట, బొబ్బిలి ప్రాంతాల్లో సబ్ సెంటర్ల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేసింది. అదేవిధంగా రెండో విడతగా గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం, జియ్యమ్మవలస, కొమరాడ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో విజ్జీ మైదానం ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details