Vizianagaram Weight Lifters: బరువులెత్తే వీరులున్న ఊరు.. విజయనగరం జిల్లాలో కొండవెలగాడ. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ఇక్కడ నుంచి మెరిశారు. సులువుగా బరువులెత్తుతూ జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు తెచ్చుకుని ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. వీరి బాటలో నడిచేందుకు గురునాయుడు, పల్లవి, హారిక ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు తగ్గ సాధన చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్, కామన్ వెల్త్ ఛాంపియన్షిప్ వంటి అంతర్జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడు ప్రతిభతో గ్రామం పేరు అంతర్జాతీయంగా సువర్ణాక్షరాలతో లిఖితమైంది. చంద్రంపేటకు చెందిన 18 ఏళ్ల గురునాయుడు మెక్సికో దేశం లియోనాలో జరిగిన ఐడబ్ల్యూఎఫ్(యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్) పోటీలలో సత్తా చాటాడు. 55 కిలోల బాలుర విభాగంలో పాల్గొన్ని స్నాచ్ 104 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ 126 కిలోలు.. మొత్తం 230 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని సాధించాడు. స్నాచ్ లో వెండి పతకం.. క్లీన్ అండ్ జెర్క్ లో బంగారు పతకం.. ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానంలో నిలవటంతో మరో బంగారు పతకాన్ని సాధించి.. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేశాడు.
ఐడబ్ల్యూఎఫ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన భారతీయ తొలి వెయిట్ లిఫ్టర్ గా రికార్డు సాధించాడు. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే కోచ్ చల్లా రాము వద్ద శిక్షణ పొందుతూ వెయిట్ లిఫ్టింగ్‌లో గురు నాయుడు ఆరి తేరాడు. తొలుత రాష్ట్రా స్థాయిలో పోటీల్లో పతకాలు సాధించి.. 2019 తాస్కాండ్ లో జరిగిన యూత్ ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2020,21లో బుద్దగయ, భువనేశ్వర్ లో జరిగిన జాతీయ పోటీలలో ఐదు జాతీయ రికార్డులను నెలకొల్పాడు.
మెక్సిలోనూ స్వర్ణం సాధించి. అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల నోయిడా ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు రజతాలు సాధించాడు గురునాయుడు. ఒకవైపు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో పతకాలు సాధిస్తూనే.. మరోవైపు చదువులోనూ రాణిస్తున్నాడు. బెల్లాన హారిక.. నోయిడా మీట్ లో తొలిసారి పాల్గొన్నా.. సత్తా చాటింది. బంగారు పతకంతో ప్రతిభ చూపింది. ఇప్పటికే ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలలో రజత పతకం సొంతం చేసుకుంది. తల్లిదండ్రులు శ్రీను, గౌరి రోజు కూలీ పనులు చేసుకుంటూ హారికను వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది హారిక.
Young Swimmer Avighna: 14 ఏళ్ల వయసులో 200 పతకాలు.. స్విమ్మింగ్‌లో అవిఘ్న సత్తా..