Cheating: ఓఎల్ఎక్స్ వెబ్సైట్ వినియోగదారులనే లక్ష్యంగా చేసుకున్న ఓ దుండగుడు దోపిడీలకు పాల్పడ్డాడు. ఇలా హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో చాలా దోపిడీలు చేశాడు. ఇంతకుముందు ఆ దుండగుడు హైదరాబాద్లో పోలీసులకు చిక్కి.. జైలుశిక్ష అనుభవించాడు. అయినా కూడా తన ప్రవర్తనలో మార్పులేదు. ప్రవృత్తిని మానుకోలేదు. అనంతరం తన స్వగ్రామం విజయనగరం వచ్చిన ఆ దుండగుడు.. తన చేతికి మళ్లీ పని చెప్పాడు. ఓఎల్ఎక్స్లో వస్తువులను అమ్మకానికి పెట్టేవారిని లక్ష్యంగా చేసుకుని వల పన్నాడు. వారి నుంచి 2 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. చివరకు.. విజయనగరానికి చెందిన ఓ బాధితుని ఫిర్యాదుతో మళ్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
విజయనగరానికి చెందిన కర్రి శివరామ కృష్ణ(38) అనే వ్యక్తి.. ఓఎల్ఎక్స్ను ఆశ్రయించి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ల వంటి యాడ్‌లను పోస్ట్ చేసిన వ్యక్తులను మోసం చేయడమే అలవాటు చేసుకున్నాడు. అతడు పలుచోట్ల మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడి వాటిపైనే బాధితుల వద్దకు చేరుకుని.. అవి తనవేనని వారిని మోసం చేసి తీసుకుని.. వారితోనే విడిది చేసేవాడు. ఇలా హైదరాబాద్లో దాదాపు 18 నేరాలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.