జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో.. హోలీ పండగను కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేధించిందని.. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహిస్తే వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసు శాఖ చేపట్టే చర్యలకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.