ఈ ఏడాది దీప కాంతులతోనే దీపావళి పండుగను జరుపుకుని.. కరోనా బాధితులకు అండగా ఉందామని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పిలుపునిచ్చారు. టపాసుల వలన తీవ్రమైన పొగ, వాయు, శబ్ద కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసు శాఖ అధ్వర్యంలో.. “గ్రీన్ దీపావళి - సేఫ్ దీపావళి - క్లీన్ దీపావళి గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మట్లాడుతూ.. దీపావళి పర్వదినాన దీపాలను వెలిగించి పండుగను జరుపుకోవాలని కోరారు. టపాసులు కాల్చటం వలన గాలి కాలుష్యమై అనారోగ్యం కలిగే అవకాశముందన్నారు. తీవ్ర కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు స్వస్తి పలికి.. తక్కువ పొగ, శబ్ధాన్నిచ్చే హరిత మతాబులను వినియోగించాలని సూచించారు.