విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలియజేశారు. మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు.. పోలీసుశాఖ ఏర్పాట్లపై జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,356 మంది సిబ్బందిని నియమించామని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ప్రచార వాహనాలకు.. సంబంధిత డీఎస్పీ, రిటర్నింగు అధికారి నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనుమతులు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం : విజయనగరం ఎస్పీ - పంచాయతీ ఎన్నికల నిర్వహణపై విజయనగరం ఎస్పీ మీడియా సమావేశం
పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.. విజయనగరం ఎస్పీ రాజకుమారి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్లతో పాటు మరి కొందరిని ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు.
ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు వినియోగించే మద్యం, సారా, గంజాయి, నగదు, బహుమతుల అక్రమ రవాణా నియంత్రణకు.. 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇప్పటి నుంచే తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటి వరకు 1,281 మందిని బైండోవరు చేశామన్నారు. 87 మంది రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్ దళాలు, రూట్ మొబైల్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. పదవీ విరమణ చేసిన పోలీసులు, మాజీ సైనికోద్యోగులు, ఇతర వ్యక్తుల సేవలనూ వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలతో వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి: చంద్రబాబు