విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం అందించనున్న ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియలో అధికారులు చేపడుతున్న చర్యలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. పేదల సంక్షేమ ఫలాలు రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవమైన జూలై 8 వ తేదీన ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 20,136 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. వీరందరికీ గుంకలాం ప్రాంతంలో ఇప్పటికే చదును చేసిన ప్రాంతంలో పట్టాలను అందించనున్నట్లు తెలిపారు. అధికారులు లేఅవుట్ నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలలో అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద కాలనీగా గుంకలాం వద్ద అవతరించనుందని తెలిపారు.
మిగిలిన ఐదు వేల మంది లబ్ధిదారులకు జమ్ములోనూ, విజయనగరం మండలంలో గుర్తించిన మూడువేల మందికి వివిధ ప్రాంతాలలో స్థలాల పట్టాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక, విభజన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందన్న విషయం గుర్తించాలన్నారు. అదేవిధంగా జూలై 3వ తేదీన పట్టాల విభజన లాటరీ విధానంలో జరుగుతుందని చెప్పారు. పేదవాడి సొంతింటి కల సాకారం చేసేలా, ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా, నవరత్నాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం రూపుదిద్దుకుంటోందన్నారు.