Vizianagaram Crop Products to Tirumala: విజయనగరం జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో 220 గ్రామాల్లో 33 వేల 575 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. వీటిలో సుమారు 32 వేల 645 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రీయ విధానాలను అనుసరించే.. ధాన్యం, మొక్కజొన్న, చెరకు.. ఇలా ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా ఈ విధానం పెరుగుతున్నా.. సేంద్రీయ పంట ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బెల్లం, ధాన్యం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది. ఈ మేరకు గత సంవత్సరం నవంబర్‌లో టీటీడీ, మార్క్ ఫెడ్, రైతు సాధికార సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఉత్పత్తులను మార్క్ ఫెడ్ కొనుగోలు చేసి తిరుమల అవసరాల మేరకు విక్రయిస్తుంది. టీటీడీ కొనుగోలు చేసే వాటికి మద్దతు ధరకు అదనంగా బెల్లానికి 15 శాతం, ధాన్యానికి 10 శాతం చెల్లిస్తారు.
టీటీడీ గతేడాది రాయలసీమ జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలను కొనుగోలు చేసి ప్రసాదం తయారీకి వినియోగించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా నుంచి 189 మెట్రిక్ టన్నుల బెల్లం, 291 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగనుంది. రైతులు ఏ పంటను ఎన్ని ఎకరాల్లో వేస్తారు.. ఎన్ని క్వింటాళ్లు సరఫరా చేయగలుగుతారో ముందే వారి నుంచి వివరాలు సేకరిస్తారు. ఇప్పటివరకు బెల్లం ఉత్తత్తికి 34 మంది, ధాన్యం విక్రయించడానికి 18 మంది పత్రాలు సమర్పించారు. ఈ ఒప్పందంలో భాగంగా 17 టన్నుల బెల్లాన్ని తిరుమలకు పంపించనున్నారు. బొబ్బిలి, బొండపల్లి, గుడ్లు, కొత్తవలస, మెరకముడిదాం రేగడి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తమ పంటలను టీటీడీ ప్రసాదానికి ఇవ్వటాన్ని రైతులు అదృష్టంగా భావిస్తున్నారు.
గతంలో ప్రకృతి, సేంద్రీయ సేద్యంపై ఆసక్తి ఉన్నా.. చాలామంది రైతులు సాగుకు ముందుకు రాలేదు. దీంతో డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి.. వీటి ప్రయోజనాలపై రైతులకు అధికారులు అవగాహన పెంచారు. అదేవిధంగా మార్కెట్ సౌకర్యం పైనా భరోసా లభించటంతో సేంద్రీయ విధానాల్లో పంటల సాగు విజయనగరం జిల్లాలో క్రమంగా విస్తరిస్తోంది. పంట వేసినప్పటి నుంచి దిగుబడి చేతికొచ్చే వరకు అధికారులు పర్యవేక్షిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు.